యాదమరి: అతివేగం.. అజాగ్రత్తగా వాహనం నడపడం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. రహదారిపై మృత్యువు రూపంలో దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. యాదమరి మండలంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కుమారుడు రాంప్రసాద్‌రెడ్డి(21) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి రాంప్రసాద్ తన స్నేహితుడైన చిత్తూరు పెద్ద హరిజనవాడకు చెందిన సురేష్ కుమారుడు ధనుష్(21)తో కలసి ద్విచక్రవాహనంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళళ్లారు. అక్కడ నుంచి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధి వరిగపల్లి జంక్షన్ వద్ద ఉన్న సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న వీరి వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తగాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ధనుష్‌ను 108 అంబులెన్సు ద్వారా చితూరు ప్రభుత్వాసుపత్రికి తరలిలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంజినీరింగ్ చదివి గొప్ప వాడై తమకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాంప్రసాద్ ఆసుపత్రిలో విగతిజీవిగా ఉండడాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్‌ఐ ఈశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని, రహదారి భద్రతా నియమాలు విధిగా పాటించి ప్రమాదాల బారీన పడకుండా విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్‌ఐ సూచించారు.


