చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ తెలిపారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న కుల వివక్షను రూపుమాపేందుకు ఆదివాసీలు, దళితులు ఐక్యమత్యంగా పోరాటాలు చేయాలన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల, పంచాయతీ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో భీమ్ ఆర్మీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్థసారథి, మేదర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి, అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నిందితుడికి
మూడేళ్ల జైలు శిక్ష
యాదమరి: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ బుధవారం చిత్తూరు ఆరవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరిత తీర్పు చెప్పారు. యాదమరి ఎస్‌ఐ ఈశ్వర్ కథనం మేరకు.. మండల పరిధి రామభద్రాపురం గ్రామానికి చెందిన సతీష్‌కు కళైవాణి అనే యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నంగా రూ.50 వేలు తీసుకురావాలని భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో వేధింపులకు తాళలేక కళైవాణి 2015 జనవరిలో అదే గ్రామంలోని ఓ చెరువు పాకలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ రఘుపతి కేసు నమోదు చేయగా, డీఎస్పీ లక్ష్మినాయుడు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
విలేజ్ సర్వేయర్‌కు పాముకాటు
గుడిపాల: గుడిపాల మండలంలో రీ–సర్వే విధులు నిర్వహిస్తున్న విలేజ్ సర్వేయర్ భవ్య బుధవారం పాముకాటుకు గురయ్యారు. ఆమె 190 రామాపురం రెవెన్యూ పరిధిలో రీసర్వే పనులు చేస్తున్నారు. పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సహోద్యోగులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుడిపాల ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వే పనులు చేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు.


