చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ మంగాపురంలో జరిగిన ఆనందరావు (50) దారుణ హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. నెలన్నర రోజులు గడిచినా హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. కేసును నీరుగార్చడంలో భాగంగానే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ మందగించడంతో అసలు కేసును మర్చిపోయారా అనే విమర్శలు వస్తున్నాయి.
దోపిడీ కాదు.. పక్కా స్కెచ్?
హత్య జరిగిన తొలినాళ్లలో ఇది దొంగల పని అని అందరూ భావించారు. ఇంటి అద్దాలు పగులగొట్టేందుకు నాటు బాంబులు వాడారన్న వార్తలు వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో నాటు బాంబుల కోసం వాడిన టపాసుల బాక్సు, సమీపంలోని పొలంలో కత్తి, ఒక బ్యాగు లభించాయని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు మాత్రం ఈ విషయాలను కొట్టిపారేస్తూ వచ్చారు. కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు తమిళనాడు వరకు వెళ్లి పలువురు అనుమానితులను విచారించాయి. గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించినా దొంగల ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఇది దొంగతనం కోసం వచ్చిన దొంగల పని కాదని, పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
సమాధానం లేని ప్రశ్నలు
పోలీసుల తీరుపై స్థానికుల్లోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. దొంగల పని కాకపోతే ఒక ఇంటి పని మనిషిని మాత్రమే ఇంత దారుణంగా గొంతు కోసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒకవేళ దోపిడీ దొంగలే అయితే ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేదా నగదును తాకకుండా ఎందుకు వెళ్లిపోతారు? గొంతును 80 శాతం వరకు కోసి అంత కక్షపూరితంగా చంపడానికి ఆనందరావు చేసిన తప్పేంటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే..
ఈ హత్యకు సంబంధించి గ్రామస్తుల్లో కొన్ని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పోలీసులు ఆ కోణంలో లోతుగా విచారణ జరిపేందుకు జంకుతున్నారనే చర్చ నడుస్తోంది. స్థానిక పోలీసుల విచారణ నెమ్మదించడంతో ఈ కేసును ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావని అభిప్రాయపడుతున్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఆనందరావు హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


