సాక్షి టాక్స్ ఫోర్స్: బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ దిమ్మెలు తరలిస్తున్న లారీని బుధవారం జీడీ నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. పోలీసులు బుధవారం జీడీ నెల్లూరులో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒక లారీ గ్రానైట్ దిమ్మెలతో వస్తుండగా సీఐ కృష్ణమోహన్ తనిఖీ చేశారు. ఎట్టేరి ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి వేల్కూరులో మరో ఫ్యాక్టరీ నుంచి లోడింగ్ చేసి ఉత్తరాఖండ్‌కు గ్రానైట్ దిమ్మెలను తరలిస్తున్నట్టు గుర్తించారు. వాటికి బిల్లులు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనంచేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ వద్ద బిల్లులు ఉన్నాయని బుకాయిస్తూ అక్కడి నుంచి వెళ్లినట్టు సమాచారం.
గతంలో పట్టుకుని వదిలేశారు
కొద్దిరోజుల క్రితం జీడీ నెల్లూరు పోలీసులు అక్రమ గ్రానైట్ దిమ్మెల లారీని పట్టుకున్నారు. ఆ లారీ కూటమికి చెందిన బడా నేతదని, తమ లారీనే పట్టుకుంటారా అంటూ వారు నానా దుర్భాషలాడినట్టు సమాచారం. సాయంత్రానికల్లా బిల్లులు పుట్టించుకుని లారీని అక్కడ నుంచి పంపించేశారు. కూటమి నేతల లారీ పట్టుకున్న సందర్భంగా జీడీ నెల్లూరు సీఐని బదిలీ చేశారు. దొంగ బిల్లులతో అక్రమ గ్రానైట్ రవాణాతో ప్రభుత్వానికి తీవ్రంగా గండిపడుతున్న పట్టించుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.


