పలమనేరు : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భార్యాభర్తలు చిన్నపాటి హోటల్‌ను నడుపుకుంటూ ముగ్గురు పిల్లలను చదివించుకునేవారు. ఇంతలో విధి వక్రించింది. ఇంటి ఇల్లాలుకు వచ్చిన చిన్నపాటి వ్యాధికోసం చికిత్సకు వెళితే అది ప్రాణాలను మింగేసే రోగంగా తేలింది. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు అప్పులు చేసి రూ.9 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే రోగం మాత్రం నయం కాలేదు. మానవత్వం ఉన్న దాతలెవరైనా ఆదుకుంటారేమోనని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. వివరాలు.. పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన కళైవాణి, బాలాజీ దంపతులకుఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు. డిగ్రీ, ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలు చదువుల్లో టాపర్లుగా ఉన్నారు. గ్రామంలోని బడిలో చదివే కుమారుడు కూడా చదవరే. బాలాజీ అదే గ్రామంలో చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా ఉండగా ఏడాది క్రితం అతడి భార్య కళైవాణి(42)కు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని పలమనేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో తిరుపతిలోని ఓమెగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా టెస్ట్‌లు చేసి వైద్యులు ఆమె లివర్ దెబ్బతిందని తేల్చారు. లివర్‌కు సంబందించిన ఆపరేషన్ చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రిలో తమవల్ల కాదమటూ బాధితులు తిరుపతిలోని స్విమ్స్‌లో చేరారు. అక్కడ పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు లివర్ క్యాన్సర్‌గా తేల్చారు. ఆపరేషన్ చేసేందుకు సైతం వీలుకాదని 70 శాతం దాకా లివర్ దెబ్బతిందని నిర్ధారించారు. అదే సమయంలో ఎన్‌టీఆర్ వైద్యసేవ కింద చికిత్స చేయించుకునేందుకు రోజుల తరబడి ఎదురు చూశారు. అయితే అనుమతులు రాకపోవడంతో బాలాజీ తన భార్య కష్టం చూడలేక ఇంటిని తనఖా పెట్టి, అప్పులు చేసి దాదాపు రూ.9లక్షలు ఖర్చుపెట్టాడు. ప్రస్తుతం చికిత్సకు డబ్బుల్లేక ఆమె ఇంట్లో మంచానికే పరిమితమైంది. తమ తల్లికిలా అయిందనే బెంగ పిల్లలకు పట్టుకుంది. తల్లి పరిస్థితిని తెలుసుకున్న మధు కళాశాల యాజమాన్యం ఇద్దరు ఆడపిల్లలకు ఫీజులు కూడా తీసుకోవడం లేదు. తమ తల్లి వైద్యానికి దాతలెవరైనా సాయం చేయాలని ఆ బిడ్డలు, భర్త వేడుకుంటున్నారు. ఎవరికై నా సాయం చేయాలనిపిస్తే వారి నంబర్:9505803100ను సంప్రదించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చేయూతనందించాలని విన్నవిస్తున్నారు.


