తిరుపతి లీగల్: కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, ఎదురుదాడి చేయడం తప్ప ప్రజలకు ఎటువంటి సేవలు అందడం లేదని తిరుపతి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్‌తో పాటు మరికొంతమంది తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారన్న అభియోగం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ కేసులో ఆరుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు, ఓ మీడియా ప్రతినిధి తిరుపతి సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మంగళవారం భూమన అభినయ్ స్థానిక సబ్ జైల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమ నియామకాల పట్ల సీబీఐ దర్యాప్తు చేయాలని జగనన్నతోపాటు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే కూటమి నాయకులు వారిపై ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ.చంద్రశేఖర్‌రెడ్డి, నరహరరెడ్డి, దొరబాబు, కొత్తపల్లి విజయకుమార్, రాజశేఖర్, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
స్థిరత్వ విశ్లేషణపై వర్క్‌షాప్
ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం తిరుపతి ఐఐటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) ఉద్యోగుల కోసం ‘అధిక పునరుత్పాదక ఇంధన వినియోగంతో స్థిరత్వ విశ్లేషణ’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. ప్రారంభోపన్యాస కార్యక్రమానికి తిరుపతి ఐఐటీ కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ – అవుట్‌రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ తంగిరాల, ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.పి.నవీన్, ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎన్.శామ్యూల్ రాజు, ఐఐటీ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ విఘ్నేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు, వివిధ విభాగాలకు చెందిన సుమారు 30 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం వల్ల తలెత్తే విద్యుత్ వ్యవస్థ స్థిరత్వ సమస్యలపై అవగాహనతో పాటు ఆచరణాత్మక, ప్రత్యక్ష అనుభవాన్ని అందించేలా కార్యక్రమం జరిగింది.


