చిత్తూరు కలెక్టరేట్:ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే ప్రత్యేక టెట్‌లో మార్పులు అవసరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయులు తాము నిత్యం బోధిస్తున్న సబ్జెక్టులు కాకుండా, ఇతర సబ్జెక్టులతో టెట్ నిర్వహించడం సరికాదన్నారు. దీంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల మనుగడకు గొంతుపై కత్తిలా మారిన టెట్ అర్హత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. స్పెషల్ టెట్ అని చెబుతున్నప్పటికీ, అందులో ఉపాధ్యాయులకు ప్రయోజనకరమైన అంశాలేవీ లేవని, ఇదంతా మభ్యపెట్టడమేనని విమర్శించారు. అందరికీ ఒకే రకమైన ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు, అర్హత, ఉత్తీర్ణత మార్కుల్లో తేడాలు చూపడం అన్యాయమని స్పష్టం చేశారు. అందరికీ 40 శాతం మార్కు లతో ఒకే రకమైన ఉత్తీర్ణత ప్రామాణికం ఉండాలని విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం సబబు కాదన్నారు. టెట్ సిలబస్, అర్హత ప్రమాణాలపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.


