కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం అత్యంత రమణీయంగా రథోత్సవం నిర్వహించారు. సర్వాలంకార భూషితుడై, సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు రథంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. గణేశుని వైభవాన్ని వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శాస్త్రోక్తంగా పూజలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామునే మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం ఉత్సవమూర్తుల ను అన్వేటి మండపానికి వేంచేపు చేసి విశేష సమర్పణ లు చేపట్టారు. పుణ్యాహవాచనం, వాస్తు పూజ, రథసా రథి ప్రతిష్టతో పాటు రథబలి, కూష్మాండ బలి పూజల ను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఆల యం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఉభయకర్తలు సమర్పించిన ఉభయం అనంతరం రథానికి ప్రత్యేక పూజలు జరిపించారు.
జయజయధ్వానాల నడుమ..
ఆలయ అధికారులు మధ్యాహ్నం రథోత్సవాన్ని ప్రారంభించడంతో స్వామి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో కాణిపాకం క్షేత్రం మార్మోగింది. వివిధ కళారూపాలు, దివ్య మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శనలు రథోత్సవానికి మరింత శోభను తీసుకువచ్చాయి. రథంపై అధిరోహించిన స్వామివారు కాణిపాక పురవీధుల్లో ఊరేగుతూ భక్తజనులకు అభయమిచ్చారు.
అశేష భక్తజనుల నడుమ రథోత్సవం
ఉప్పొంగిన భక్తిభావం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవంలో భక్తిభావం ఉప్పొంగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5:45 గంటలకు వైభవంగా ముగిసింది. అయితే రథోత్సవం సాగుతుండగానే సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథం వెంటే సాగారు.


