వర్షాలపై విద్యుత్‌శాఖ అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

వర్షాలపై విద్యుత్‌శాఖ అప్రమత్తం

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

తిరుపతి రూరల్‌: భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులుతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్తంభాలు కూలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగిపడటం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే 1912, 1800 425 155333 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా 91333 31912 వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు గురజాడ అప్పారావు చిత్రపటానికి నివాళి అర్పించారు.

డయల్‌ యువర్‌ సీఎండీకి 103 వినతులు

‘డయల్‌ యువర్‌ సీఎండీ’, ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాలకు 103 మంది వినియో గదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలపై వినతులు అందినట్లు సీఎండీ శివశంకర్‌ తెలిపారు.

నేటి నుంచి పవిత్రోత్సవాలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ యాగశాల నుంచి పట్టువస్త్రాలు, పట్టు పవిత్రాలు, పాదుకలు, సుగంధ ద్రవ్యాలు తదితర పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి వినాయకస్వామి, చెంగల్రాయస్వామి, శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ గర్భాలయాల్లో ఉంచి విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గర్భాలాయల్లో విశేషాధిపూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆ సమయాల్లో అంతరాలయ దర్శనం ఉండదన్నారు. ప్రతిరోజూ ఉదయం 10గంటలకు నిర్వహించే ఉచ్ఛికాల అభిషేకం పవిత్రోత్సవాల సందర్భంగా ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం దీపారాధణ సేవ టిక్కెట్లు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

రుయాలో

హోమ్‌ కేర్‌ నర్సింగ్‌ కోర్సు

తిరుపతి తుడా: రుయా ఆసుపత్రిలో హోమ్‌ కేర్‌ నర్సింగ్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభించినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీ.రవిప్రభు తెలిపారు. రుయా ఆస్పత్రి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ తిరుపతి, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల కాలవ్యవధితో హోమ్‌ కేర్‌ నర్సింగ్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ కోర్సును వైద్యాధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలియేటివ్‌ కేర్‌ రోగులకు సేవలందించేందుకు శిక్షణ పొందిన సంరక్షకుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ.మనోహర్‌ మాట్లాడుతూ ఆస్పత్రితో పాటు ఇంటి వద్ద పాలియేటివ్‌ కేర్‌ అవసరమైన రోగులకు మెరుగైన సేవలందించగల నైపుణ్యం కలిగిన నర్సింగ్‌ సహాయకులను తీర్చిదిద్దడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement