సూర్య తేజం.. చంద్ర వికాసం | - | Sakshi
Sakshi News home page

సూర్య తేజం.. చంద్ర వికాసం

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

● తుమ్మలగుంటలో వేడుకగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు ● కల్యాణ వెంకన్నపై సూర్యకిరణాలు తాకగానే ప్రత్యేక హారతులు ● భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిన పురవీధులు

తిరుపతి రూరల్‌: తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై అనంత తేజోమయుడిగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా.. రాత్రి చంద్రప్రభ వాహనంపై చల్లనయ్యగా కటాక్షించారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ సందర్భంగా సరిగ్గా 6.45 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకిన సమయంలో అర్చకులు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయాయి.

చంద్రప్రభపై.. చల్లనయ్యగా..

సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహన సేవకు చంద్రగిరి మండలంలోని చంద్రగిరి, రెడ్డివారిపల్లి, నరసింగాపురం, రాయలపురం, తిరుపతి రూరల్‌ మండలం నుంచి గాంధీపురం గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. చంద్రప్రభ వాహన సేవకు రామచంద్రాపురం మండలం నెన్నూరు, నడవలూరు, సొరకాయలపాలెం, దేసూరికండ్రిగ, సి.రామాపురం, పి.వి.పురం గ్రామాలకు చెందిన భక్తులు సారె సమర్పించారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి వాహన సేవల్లో పాలు పంచుకున్నారు.

నేడు రథోత్సవం

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారు రథంపై ఆశీనులై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement