ఆనవాళ్లు లే‘కొండ’! | - | Sakshi
Sakshi News home page

ఆనవాళ్లు లే‘కొండ’!

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

● జాతీయ రహదారి పనుల పేరిట యథేచ్ఛగా అనుమతులు ● రాత్రింబవళ్లు ఇష్టారాజ్యంగా క్రషింగ్‌ ● కరిగిపోతున్న కొండలు

నగరి : నగరిలో క్రషింగ్‌ మాఫియా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రూ.కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టేస్తోంది. అనుమతులు ఇచ్చేశాం ఇక మనకేం పని అంటూ అధికారులు కళ్లుమూసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు కంకరను తరలించుకుపోతున్నారు. మండలంలోని గుండ్రాజుకుప్పంలోనే కొండలు ఎక్కువగా ఉండడంతో క్రషింగ్‌ మాఫియా కన్ను ఈ పంచాయతీపై పడింది. జాతీయ రహదారి పనులు వీరికి కలసి వచ్చాయి. దీంతో ఎడాపెడా కొండలను పిండి చేసేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే మొత్తం దందా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఒక్క బిల్లుతోనే..

నగరి పట్టణం తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో కంకర తరలింపు జోరుగా సాగుతోంది. ఒకే బిల్లుపై మూడు, నాలుగు ట్రిప్పర్ల కంకరను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అరికట్టాల్సిన మైనింగ్‌శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండి పడడంతో పాటు ప్రకృతి సంపద తరించుకుపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రషింగ్‌ నడిపేవారిలో తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్లే ఎక్కువగా ఉండంతో తరలింపు సులభతరంగా మారుతోంది.

ఏపీఎండీసీ భూముల్లో సైతం..

ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎండీసీ) భూములను కూడా మైనింగ్‌ మాఫియా వదలిపెట్టడం లేదు. ఆ భూముల్లో సైతం రిగ్గులు వేసి బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. ఈ పేలుళ్లకు సమీప గ్రామాలు సైతం అదిరిపడుతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే ఉన్న కొండల్లో పెట్టే బ్లాస్టింగ్‌ల కారణంగా దారి మొత్తం పొగ కమ్ముకుంటోంది. రాత్రి వేళ పేలుళ్ల కారణంగా జనం నిద్రకు సైతం దూరమవుతున్నారు. సాధారణంగా జనావాసాలకు దూరంగా ఉండే కొండలకు మాత్రమే బ్లాస్టింగ్‌ అనుమతులు ఇవ్వాలి. అయితే ఇళ్ల సమీపంలోని కొండలపై కూడా యథేచ్ఛగా బ్లాస్టింగ్‌ జరుగుతోంది. దీనిపై మైనింగ్‌శాఖ, విజిలెన్సు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement