పలమనేరు/పెద్దపంజాణి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదంలోకి లాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అసలు స్వరూపం బయటపడిందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవ ని సీబీఐ తేల్చిందన్నారు. అంతే కాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్ల లోని నిల్వలను మారు పేరు తో ఆగస్టు 2024లో చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత మళ్లీ టీటీడీకి సరఫరా చేసినట్లు సీబీఐ సిట్ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలు, కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికై నా మీరు చేసిన ఆరోపణలు తప్పు అని అంగీకరిస్తారా? అని నిలదీశారు. జంతు కొవ్వు ఉందని ఆరోపణలతో వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడం రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. టీటీడీకి వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ నుంచి నమూనాలు తీసుకుని నాణ్యత పరీక్షలు చేస్తారని జగన్ ముందే చెప్పారని గుర్తు చేశారు. లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఎలా ప్రకటించారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందుకు చంద్రబాబు బేషరుతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు తేలకముందే ప్రాయశ్చిత్త దీక్షలు, సభలు, ప్రకటనలతో భక్తులను మరింత రెచ్చగొట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు.


