చిత్తూరు రూరల్ (కాణిపాకం): వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి నుంచి సుమారు రూ.90 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని పోలీస్ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కల్లూరు– పుంగనూరు రోడ్డులోని శ్రీకృష్ణ జ్యువెలరీస్ దుకాణంలో జూలై 17న భారీ చోరీ జరిగిందన్నారు. అలాగే పాలసముద్రం, గంగాధర నెల్లూరు, తవనంపల్లె మండలాల పరిధిలోని నాలుగు వరుస దొంగతనాలు జరిగాయని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం పాలసముద్రం మండలం దీనబంధాపురం గ్రామం వద్ద నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడు ఆర్.దినేష్ (25)పై ఇప్పటికే 18 దొంగతనం కేసులు ఉన్నాయని, బాలయ్య చిరంజీవి (34)పై తిరుపతి జిల్లా పుత్తూరులోని ఒక హత్య కేసుతో సహా 4 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరితో పాటు తమిళనాడు, చిత్తూరు జిల్లాలకు చెందిన జగన్ అలియాస్ బెరికి (19), వసంత్ కుమార్ అలియాస్ తుపాకి (19), ఈ.సిలంబరసన్ అలియాస్ శింబు (19)ను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 404 గ్రాముల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.90 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించి భారీగా సొత్తును రికవరీ చేసిన కల్లూరు పోలీస్ సిబ్బంది, ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు.


