– శాస్త్రోక్తంగా వరుణ యాగం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో చైర్మన్ అశోక్‌రాజు నిర్వహిస్తున్న నవాహ్నిక విశ్వగురు మహా సంకల్ప సిద్ధి యాగంలో భాగంగా ఆదివారం వైభవంగా వెంకన్న కల్యాణం, వరుణ యాగం నిర్వహించారు. ఉదయం 8 నుంచి నాలుగు గంటల పాటు నిర్వహించిన అరుణ పారాయణం, సూర్య యంత్ర పూజల్లో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యాగ ఫలితంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సంతోషంగా జీవించడానికి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ నారాయణం తనూజ్ విష్ణువర్ధన్ కల్యాణం– వైశిష్ట్యతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం 5 గంటలకు శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి రెండు గంటల పాటు వేద పండితులు విశేష వరుణ యాగం చేపట్టారు. అశోక్‌రాజు మాట్లాడుతూ వరుణ యాగంతో వర్షాలు కురిసి, నదులు ప్రవహించి, చెరువులు, కుంటలు నిండి ప్రజల తాగునీటి సమస్యలు తీరడంతో పాటు వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు వివరించారు.


