చిత్తూరు కలెక్టరేట్ : మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి సాధ్యమని రాష్ట్ర సీ్త్ర నిధి శాఖ ఎండీ హరిప్రసాద్ తెలిపారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక పురోగతి, సాధికారత లక్ష్యంగానే సీ్త్ర నిధి సంస్థ పనిచేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాను బ్రాండ్ నేమ్‌గా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి నూతన ప్రాజెక్ట్, సంక్షేమ కార్యక్రమం చిత్తూరు జిల్లా నుంచే ప్రారంభం కావడం యంత్రాంగానికి దక్కిన ప్రతిష్టని ప్రశంసించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రుణాలు లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయి, క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే వారి కుటుంబాలు, సమాజం పురోగతి సాధిస్తాయన్నారు. సంస్థలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. దీంతో సంస్థ పనితీరు మరింత వేగవంతమై ప్రగతి సాధించవచ్చని వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు పెద్దపంజాణి విద్యార్థిని
పెద్దపంజాణి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలోని కేవీఎస్ మైదానంలో ఈ నెల 16వ తేదీన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దపంజాణి మండలంలోని శంకర్రాయలపేట మహా త్మా జ్యోతిబా పూలే పాఠశాలకు చెందిన 9వతరగతి విద్యార్థిని జి.మౌనిక అండర్–14 అథ్లెటిక్స్ విభాగంలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ జ్యోత్స్న శుక్రవారం తెలిపారు. త్వరలో కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించనున్న 41వ స్టేట్ మీట్‌లో జిల్లా తరఫున పాల్గొంటుందని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చెంచులక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ విక్టోరియా అభినందించారు.
నేడు తుమ్మలగుంటలో గరుడోత్సవం
తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమోక్తంగా విశేష అలంకరణలతో గరుడోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో గరుడసేవను దర్శించలేని శ్రీవారి భక్తులు తుమ్మలగుంటకు విచ్చేసి గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


