చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజ యం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన శాఖ అధికారిని సంకీర్తన చావన్ తెలిపారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 15 నుంచి 29 ఏళ్లలోపున్న యువతీ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జానపద నృత్యాలు, జానపద గేయాలు, నుక్కడ్ నాటక్, చిత్రలేఖనం, కవితా రచన పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9440573537 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
సేవా సంకల్ప
అభియాన్ ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రోగులకు మెరుగైన వైద్య సేవలే ధ్యేయంగా గురువారం నుంచి వచ్చే అక్టోబర్ 17 వరకు జిల్లా వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్ పద్మాంజలిదేవి, సూపరింటెండెంట్ ఉషశ్రీ తెలిపారు. పేషెంట్ కేర్ వీక్ ముగింపు సందర్భంగా గురువారం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాల్లో బీపీ, షుగర్, గైనకాలజీ, కంటి పరీక్షలు చేసి మందులు అందజేస్తామని తెలిపారు.
వరసిద్ధుడికి
కనకదుర్గమ్మ పట్టువస్త్రాలు
కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున గురువారం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయవాడ ఈవో శీనా నాయక్, చైర్మన్ రాధాకృష్ణ పట్టువస్త్రాలు అందజేయగా, కాణిపాకం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశా రు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
22 మంది గిరిజనులకు పట్టాల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అర్హులైన గిరిజనులు 22 మందికి అటవీ హక్కుల పట్టాలను కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు పంపిణీ చేశారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ హక్కుల చట్టం (ఆర్‌వోఎఫ్‌ఆర్) కింద జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన 18 మంది, తవణంపల్లి మండలానికి చెందిన నలుగురు గిరిజనులకు 31.07 ఎకరాలకు సంబంధించి పట్టాలు, పట్టదారు పాసు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్, గిరిజనులు పాల్గొన్నారు.
కొత్త పింఛన్లకు
40,020 దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పొడిగించిన గడువు శుక్రవారంతో గడువు ముగియనుంది. డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 7 నుంచి గురువారం సాయంత్రం వరకు మొత్తం 40,020 దరఖాస్తులు అందినట్టు పేర్కొన్నారు. ఇందులో వృద్ధులు 21,304 మంది, వితంతువులు 8,156 మంది, దివ్యాంగులు 6,673 మంది, చేనేత కార్మికులు 116 మంది, మత్స్యకారులు 64 మంది, ఒంటరి మహిళలు 250 మంది, ట్రాన్స్‌జెండర్స్ 11 మంది, చర్మకారులు 372 మంది, డప్పు కళాకారులు 2,970 మంది, కల్లుగీత కార్మికులు 104 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,608 మంది దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, 197 దరఖాస్తులను తిరస్కరించారు. వచ్చి న దరఖాస్తులన్నింటినీ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ఎంపీడీవోల లాగిన్‌కు పంపించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంపీడీవోలు వాటిని పరిశీలించి ఆమోదించిన అనంతరం ఈ నెల 24వ తేదీ నాటికి నేరుగా సెర్ప్ సీఈఓకు సమర్పించేలా డీఆర్‌డీఏ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.


