వెదురుకుప్పం: అనారోగ్యంతో బాధపడుతూ వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్న బాలుడికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేయూత ఇచ్చారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించారు. వెదురుకుప్పం మండలం తంగేళిమిట్టకు చెందిన గిరిబాబు కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేదు. ప్రస్తుతం వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి వైద్యం కోసం తల్లిదండ్రులు ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేశారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు కొండారెడ్డి, రామయ్య వైఎస్సార్‌సీపీ గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కే.కృపాలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె బాలుడిని ఆదుకోవాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కోరారు. స్పందించిన ఎంపీ మిథున్‌రెడ్డి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం పుత్తూరులోని క్యాంపు కార్యాలయంలో పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలో లేకున్నా బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ పండ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించడం అబినందనీయమన్నారు. కష్ట కాలంలో బాలుడి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించడం కొండంత ధైర్యాన్నిచ్చినట్టేనన్నారు. నిధులు మంజూరు చేయించడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


