ఏడీ సరెండర్‌పై దివ్యాంగుల హర్షం | - | Sakshi
Sakshi News home page

ఏడీ సరెండర్‌పై దివ్యాంగుల హర్షం

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

● పసుపు నీటితో కార్యాలయం శుద్ధి ● త్వరలో ఏడీ వినోద్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు ● జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : దివ్యాంగుల సంక్షేమ నిధులను పక్కదోవ పట్టించిన విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్‌ కుమార్‌ను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో దివ్యాంగుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు కొణతల చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి మురళి, జేఏసీ సభ్యులు గురువారం కలెక్టరేట్‌లోని ఏడీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. వినూత్న నిరసన, శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతకాలంగా కార్యాలయంలో నెలకొన్న అవినీతి మరకలు, గ్రహణం తొలగిపోవాలని కోరుతూ ప్రాంగణంలో పసుపు నీళ్లు చల్లి, పుణ్యాహ వచనం చేశారు. అనంతరం దివ్యాంగులతో కలసి కార్యాలయంలోకి ప్రవేశించారు.

లోకాయుక్తకు ఫిర్యాదు

జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతల చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులకు అందాల్సిన సుమారు రూ.కోటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఏడీ వినోద్‌ కుమార్‌ తన సొంత ఖాతాలకు మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై తాము పలుమార్లు కలెక్టరేట్‌ వద్ద నిరసనలు తెలిపినట్లు చెప్పారు. కలెక్టర్‌ స్పందించి సమగ్ర విచారణ జరిపించారని తెలిపారు. అవినీతి నిజమని తేలడంతో ఏడీ వినోద్‌ను మాతృశాఖకు సరెండర్‌ చేశారని తెలిపారు. ఏడీని సరెండర్‌తో సరిపెట్టకుండా, ఆయన దోచుకున్న నిధులను తిరిగి సేకరించి జిల్లాలోని దివ్యాంగులకు అందజేసేలా త్వరలోనే లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇన్‌చార్జి జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ గా ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ అధికారి పుల్లారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు లీలావతి, సుమతి, చెంచులక్ష్మి, గోపి, సతీష్‌, చిట్టిబాబు, గజేంద్ర, పురుషోత్తం, మధు, శ్రీనివాసులు, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement