29 న పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు 18న ఓటర్ల జాబితా ప్రకటన
తల్లిదండ్రుల వివరాల సేకరణలో
ఆశావహులు
కసరత్తు చేస్తున్న విద్య, సమగ్రశిక్ష శాఖ అధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థుల సంక్షేమం, విద్యాప్రమాణాల మెరుగుదలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు కీలకం. దీంతో ఈ కమిటీల్లో స్థానం కోసం ఆశావహులైన తల్లిదండ్రులు సైతం నేతలను ఆశ్రయిస్తున్నారు. నాయకులు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులు పదవుల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇప్పటికే నాయకుల చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు తల్లిదండ్రులను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు డీఈవో లక్ష్మీనారాయణ, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ ఇలా
జిల్లాలోని 2047 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 18న ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల పరిశీలన అనంతరం 25న తుది ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. ఈ నెల 29వ తేదీన అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1702, ప్రాథమికోన్నత పాఠశాలలు 40, ఉన్నత పాఠశాలలు 305 ఉన్నాయి. వీటిలో 1,10,672 మంది విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
12 నుంచి 25 మందితో కమిటీ
విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలలో 12 నుంచి 25 మంది సభ్యులతో యాజమాన్య కమిటీ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిబంధనల ప్రకారం ఇతర సభ్యులు ఇందులో ఉంటారు. నూతన కమిటీ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంలో కమిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 2024 ఆగస్టు 8న పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండటంతో బడి కమిటీల ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది. పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరగనుండటంతో నేతలు, ఆశావహులు పావులు కదుపుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులే కీలక ఓటర్లు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల వారిగా వారి వివరాలను ఆరా తీస్తూ మద్ధతు కూడుగట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రామాల్లో తమ పట్టును కొనసాగించేందుకు కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంపై రాజకీయ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
జిల్లా సమాచారం
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,702
ప్రాథమికోన్నత పాఠశాలలు 40
ఉన్నత పాఠశాలలు 305
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 48,231
ప్రాథమికోన్నత విద్యార్థులు 2,458
ఉన్నత పాఠశాలల విద్యార్థులు 59,983
మొత్తం విద్యార్థులు 1,10,672
పల్లెల్లో వేడెక్కనున్న రాజకీయం
25న తుది జాబితా విడుదల


