కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి తన వాహనమైన మూషికంపై విహరిస్తూ దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించి భక్తులు మైమరిచిపోయారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు అర్చకులు శాస్త్రోక్తంగా పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి స్వామివారిని పరిమళ భరిత వివిధ రకాల పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ స్వామివారు మూషిక వాహనంపై కొలువుదీరి విహరించారు. విఘ్నాలు తొలగించి, తమ కుటుంబాలను చల్లగా కాపాడాలని భక్తులు కర్పూర హారతులు పట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మూషిక వాహన సేవకు కాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లె, పట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాల విశ్వకర్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు.


