అక్రమాల ‘వినోదం’ | - | Sakshi
Sakshi News home page

అక్రమాల ‘వినోదం’

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

దివ్యాంగుల నిధుల మాయాజాలం గుట్టురట్టు సుదీర్ఘంగా దివ్యాంగ సంఘాల ఆందోళన సమగ్ర విచారణ అనంతరం ఏడీపై సరెండర్‌ వేటు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో చోటుచేసుకున్న భారీ నిధుల అక్రమాల వ్యవహారంలో ఎట్టకేలకు కీలక పరిణామం చోటుచేసుకుంది. తీవ్రస్థాయి అవినీతి, ప్రభుత్వ నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీ వినోద్‌ కుమార్‌ను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. రూ.కోటి వరకు ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని జూన్‌ నెల నుంచి సాగిస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని దివ్యాంగ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోనే వివిధ కేడర్లలో 30 ఏళ్లుగా పనిచేస్తూ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ వచ్చిన వినోద్‌ కుమార్‌ ఏడీగా ఉద్యోగోన్నతి పొందిన 9 నెలల్లోనే భారీగా నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నేతలు చంద్రశేఖర్‌, మురళి ఈ ఏడాది జూన్‌ నుంచి పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు నిర్వహించడంతో పాటు, పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

విచారణతో తేలిన అక్రమాలు

ఈ వ్యవహారంపై కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. మొదట డిప్యూటీ కలెక్టర్‌ సురేష్‌ను విచారణాధికారిగా నియమించగా, ఆయన ట్రైనింగ్‌ నిమిత్తం అమరావతికి వెళ్లడంతో విచారణ బాధ్యతలను జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌కు అప్పగించారు. విచారణలో పలు అవకతకవలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నషాముక్త్‌ భారత్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండానే రూ.8.94 లక్షలను వేరే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బిల్లులు పొందడం, వయోవృద్ధుల చట్టాలపై ప్రచారానికి కేటాయించిన రూ.16 లక్షలు, అలాగే వివిధ వసతి గృహాల నిర్వహణ నిధులను తన బినామీలు, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించడం, వాహనాన్ని వాడకుండా, చివరికి మెడికల్‌ లీవ్‌లో ఉన్న సమయంలోనూ నెలకు రూ.35 వేల చొప్పున అక్రమంగా వాహన బాడుగ బిల్లులు పొందినట్లు తేలినట్లు తెలిసింది.

త్వరలో శాఖాపరమైన చర్యలు

జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ సమర్పించిన సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా ఏడీ వినోద్‌ కుమార్‌ను సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, దివ్యాంగుల సంక్షేమ నిధులను పక్కదారి పట్టించిన సదరు అధికారిపై క్రిమినల్‌, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దివ్యాంగ సంఘాల నేతలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement