●
పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ పంచాయతీ రాజుఇండ్లు సమీపంలో ఉన్న గుట్టలోని ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టరాదని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు బుధవారం గుట్ట వద్దకు వేస్తున్న రోడ్డు పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గుట్టలో గతంలో చెట్లు పెట్టి బిందెలతో నీరు పోసి సంరక్షించామని తెలిపారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఎర్రమట్టి కోసం అనుమతులు తెచ్చుకున్నామని చెబుతూ మామిడి చెట్లను తొలగించి రోడ్డు వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గుట్టలో మట్టిన తవ్వి తమిళనాడుకి తరలిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ గ్రామానికి చెందిన కొందరు పశువులు, మేకలు, గొర్రెలను గుట్టలోకి మేత కోసం తీసుకెళుతున్నారని, గుట్టను తవ్వేస్తే వాటికి మేత ఎక్కడి నుంచి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో గుట్టలో మొక్కలు నాటాం
మా గ్రామం సమీపంలో ఉన్న గుట్టలో గతంలో వివిధ మొక్కలు నాటి బిందెలతో నీరు పోసి పెద్ద చేసుకున్నాం. ఇప్పడు ఎర్రమట్టి తవ్వుకోవడానికి అనుమతి తీసుకున్నామని చెప్పి చెట్లను జేసీబీతో తొలగించి రోడ్డు వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– పి.వెంగమరాజు, రాజు ఇండ్లు
అధికారులు స్పందించాలి
మా గ్రామ సమీపంలో పచ్చ పచ్చని చెట్లతో కూడిన గుట్టను ఎర్రమట్టి పేరుతో నాశనం చేసున్నారు. మూగజీవాలకు మేత లేకుండా చేస్తున్నారు. అధికారులు స్పందించి మా గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టులో ఎర్రమట్టి గ్రావెల్ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి.
– కే ధనంజయరాజు, రాజు ఇండ్లు
అనుమతిని రద్దు చేయాలి
గుట్టలో ఎర్రమట్టి తవ్వకాలు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. ఎన్నడూ లేని విధంగా ఎర్రమట్టిని తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులకు తవ్వుకుంటే అధికారులు అడ్డు చెబుతున్నారు. తమిళనాడుకు తరలించడానికి అనుమతి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు.
– జగనాథరాజు, రాజు ఇండ్లు


