రాజ్‌ కాలువ ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

రాజ్‌ కాలువ ఆక్రమణ

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

కనిపించని పెంటాలమ్మ చెరువు కాలువ శూలాల గుడికి రక్షణ కరువు ఆక్రమణలో కల్వర్టు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్న అక్రమార్కులు

కుప్పం: ఇటీవల కుప్పం పట్టణ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు పనులు జోరందుకున్నాయి. దీనికితోడు గ్రామాలకు చెందిన వారు పిల్లల చదువులు, చిన్నచిన్న పనుల కోసం కుప్పంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు. దీంతో భూములు, స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు అధికార పార్టీ నేతలు కుప్పం పట్టణ సమీపంలోని సామగుట్టపల్లి వద్ద వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వేశారు. ఆ భూముల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు, పంట కాలువలను సైతం ఆక్రమించుకుని చదును చేసి ప్లాట్లుగా మార్చేశారు.

చెరలో రాజ్‌ కాలువ

చిన్న శెట్టిపల్లి వద్ద ఉన్న పటాలమ్మ చెరువు నుంచి బైరుగానిపల్లి చెరువు వరకు 20 అడుగుల వెడల్పుతో ఉన్న రాజ్‌ కాలువను ఆక్రమించుకునేశారు. నామ మాత్రంగా 20 అడుగుల కాలువలను మూ డు అడుగులకు కుదించి రివ్విట్‌మెంట్‌ కట్టారు. సుమారు 3 కిలో మీటర్ల దూరం 20 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న కాలువ పూర్తిగా అక్రమణకు గురింది. అంతేకాకుండా కుప్పం ముఖద్వారం ఆర్చి వద్ద ఉన్న పెద్ద వారాది పక్కన చిన్న వారాదిని కూల్చివేశారు. ఆ స్థలం చదును చేసి ప్లాట్లుగా మార్చేసి దర్జాగా రియల్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈ 20 అడుగుల రాజ్‌ కాలువ గురించి పట్టించుకునే నాథుడు లేడని స్థానికులు అంటున్నారు.

శూలల గుడి స్థలానికి రక్షణ కరువు

పలమనేరు–కుప్పం జాతీయ రహదారి పక్కనే పురాతన శూలాల గుడి ఉంది. ఈ ఆలయానికి 0.23 సెంట్లు భూమి ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను ఈ స్థలంపై పడిందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు గురైందని, మిగిలిన స్థలాన్ని సర్వే చేసి ఫెన్సింగ్‌ వేయాలని వారు అధికారులను కోరుతున్నారు.

అధికార పార్టీ నేతలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. జోరుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఏళ్లనాటి రాజ కాలువలు, దేవాలయ భూములు, ప్రభుత్వం నిర్మించిన కల్వర్టులను ఆక్రమించుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. 20 అడుగుల వెడల్పుతో సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉన్న రాజ కాలువను ఆక్రమించి ఆనవాళ్లు లేకుండా చేశారు. కాలువను పూడ్చేసి ప్లాట్లుగా మార్చేశారు. వీటిని కోనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.

కనుమరుగైన రెండు కల్వర్టులు

రోడ్డు పక్కన శూలాల గుడి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో వర్షపు నీరు ప్రవాహించడానికి గతంలో ఇరిగేషన్‌ శాఖ రెండు కల్వర్టులు నిర్మించింది. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల దెబ్బకు రెండు కల్వర్టులు కనుమరుగయ్యాయి. వీటిని పడగొట్టి చదను చేసి లే అవుట్‌లో కలిపేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement