నగరి : ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం నుంచి నగరికి వచ్చిన ఒక యువకుడు కొన్ని రోజులకే తను వు చాలించడం విషాదాన్ని నింపింది. నగరి పట్టణంలోని ఓం శక్తి గుడి సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా అందేరిపట్టికి చెందిన ఎం.ప్రశాంత్ (31) కొంతకాలంగా స్వీట్ మాస్టర్‌గా పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. తిరుత్తణి తాలూకా కనకమ్మసత్రంలోని ఓ బేకరీలో సుమారు నాలుగేళ్లు పనిచేశాడు. అనంతరం శ్రీకాళహస్తిలోని మరో బేకరీలో పనిచేసి, ఈ నెల 4వ తేదీ నుంచి నగరి ఓంశక్తి ఆలయం సమీపంలోని బేకరీలో స్వీట్ మాస్టర్‌గా విధుల్లో చేరాడు.
టిఫిన్ చేసి వస్తానని వెళ్లి..
శనివారం ఉదయం దుకాణానికి వచ్చిన ప్రశాంత్.. సుమారు 10 గంటల సమయంలో టిఫిన్ చేసి వస్తానని షాపు యజమాని సుందరేశన్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో మధ్యాహ్నం ప్రశాంత్ అద్దెకు ఉంటున్న గదికి సుందరేశన్ వెళ్లి చూడగా తలుపులు, కిటికీలు లోపలి నుంచి గడియపెట్టి ఉన్నాయి. దీంతో ఇంటి యజమానులతో కలిసి కిటికీలోంచి పరిశీలించగా.. వంటగదిలో ప్రశాంత్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న నగరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ప్రశాంత్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మృతుడి తల్లి గోవిందమ్మకు సమాచారం అందించారు.మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్‌న్స్‌లో నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై నగరి పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, వివాహమైన రెండు నెలలకే భార్య నుంచి విడిపోవడంతో ప్రశాంత్ ఒంటరిగానే ఉంటున్నాడు.


