చిత్తూరు కలెక్టరేట్ : వందేళ్ల చరిత్ర కలిగిన బీఎస్.కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఆధునికీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తెలిపారు. పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సుబ్రమణ్యం చెట్టియార్ తన కుమారుడి జ్ఞాపకార్థం విలువైన స్థలాన్ని పాఠశాలకు అందించారని కొనియాడారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు. స్వర్గీయ కేశవరెడ్డి ఫౌండేషన్ పేరిట రూ.3.50 లక్షల వ్యయంతో పాఠశాల ప్రాంగణంలో ప్రార్థన షెల్టర్ నిర్మించిన పూర్వ విద్యార్థి, ఫౌండేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డిని సత్కరించారు. చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత మాట్లాడుతూ విద్యార్థులు విద్యా వైజ్ఞానిక రంగాల్లో రాణించాలన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పూల సుబ్రమణ్యం 31 మంది విద్యార్థులకు కణ్ణన్ పేరుతో టీషర్టులను అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం కోమల, కళాశాల ప్రిన్సిపల్ మాలతి, పూర్వ విద్యార్థుల సంఘం నేతలు నరసింహులునాయుడు, కృష్ణమూర్తి, లోకనాథం, మునిరత్నం, మురళి, కుమారస్వామి పాల్గొన్నారు.


