చిత్తూరు కలెక్టరేట్ : కొత్త పింఛన్‌ల నమోదులో అర్హులైన దివ్యాంగులు ఎదుర్కుంటున్న సమస్యలపై సాక్షి దినపత్రికలో ఈ నెల 11వ తేదీన నిబంధనల సంకెళ్లు శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. నూతన పింఛన్ల నమోదులో క్షేత్రస్థాయిలో అర్హులైన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సాంకేతిక అడ్డంకులు, అధికారుల నిర్లక్ష్యంపై సాక్షి సమగ్ర కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ముఖ్యంగా ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్‌లోని పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు (పొంతన లేకపోవడం) ఉన్నాయనే సాకుతో అధికారులు దరఖాస్తులను స్వీకరించకుండా తిరస్కరిస్తున్నారని బాధితుల ఆవేదనను సాక్షి వెలుగులోకి తెచ్చింది.
చొరవ చూపిన అధికారులు
ఈ కథనం ప్రచురితం కావడంతో స్పందించిన సంబంధిత శాఖ అధికారులు యాదమరి మండలానికి చెందిన దివ్యాంగులు మధుబాబు, సురేఖల దరఖాస్తు సమస్యను వెంటనే పరిష్కరించారు. వారి నుంచి వివరాలను సేకరించి, సాంకేతిక లోపాలను సరిదిద్ది దరఖాస్తులను విజయవంతంగా ఆన్‌న్‌లైనన్‌లో నమోదు చేయించారు. రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరిగినా తీరని తమ సమస్య సాక్షి కథనంతో వెంటనే పరిష్కారం కావడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.


