చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కరువు మండలాలను వెంటనే ప్రకటించి ఆదుకోవాలని ఆల్ ఇండియా కిసాన్ సభ జిల్లా అధ్యక్షుడు మునిరత్నం, నాయకుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు చిత్తూరు ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఎండిన పంటలతో నష్టపోయిన రైతులను, ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని కోరారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. కరువు ప్రభావిత మండలాలను వెంటనే గుర్తించి అధికారికంగా ప్రకటించాలని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ప్రత్యేక కరువు ప్యాకేజీని తెప్పించాలన్నారు. సాధారణ పంటలకు ఎకరాకు రూ.10వేలు ఇన్‌పుట్ సబ్సిడీ, వాణిజ్య, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.25వేలను నష్టపరిహారం అందించాలని కోరారు. నిజమైన కౌలు రైతులను గుర్తించి ఇన్‌న్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పంటలను కాపాడుకునేందుకు నీటి రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు.
వలసల నివారణకు ఉపాధి పనులు
గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పనులను భారీగా చేపట్టాలన్నారు. రోజువారీ కూలీని రూ.700కి పెంచాలని కోరారు. కరువు ప్రభావిత రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులకు నెలకు రూ.10 వేల కరువు భృతి అందించాలని డిమాండ్ చేశారు. పశువులకు ఉచితంగా గ్రాసం, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. బాధిత కుటుంబాల విద్యార్థుల ఫీజులను పూర్తిగా మాఫీ చేసి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఉపాధి కల్పనకు గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పాలని స్పష్టం చేశారు. అనంతరం ఆర్‌డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నేతలు నాగరాజన్, గోపీనాథ్, దాసరి చంద్ర, మణి, రమాదేవి, విజయ్ గౌరీ, బాలాజీ రావు, రఘు, జమీలాబీ పాల్గొన్నారు.


