కాణిపాకం/బంగారుపాళ్యం: వాహనాల ఫిట్‌నెస్ ప్రక్రియలో పారదర్శకత పెంచాలని, మానవ ప్రమేయం తగ్గించి వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. బంగారుపాళ్యంలో ఉన్న ఏటీఎఫ్ కేంద్రం అక్రమ సంపాదనకు, దళారుల దాహానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం వద్ద ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఏజెంట్లే ఇప్పుడు ఇక్కడికి తమ డేరా మార్చారు. ఇక్కడి సిబ్బందితో చేతులు కలిపి బహిరంగంగా దందా చేస్తున్నారు.
గ్రీన్‌సిగ్నల్ వస్తేనే ఫైలు ముందుకు
ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా అధికారిక పద్ధతిలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందుదామని వచ్చే వాహనదారులకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. అక్రమ దందాకు తలొగ్గని వారిని టార్గెట్ చేస్తూ చిన్న చిన్న సాంకేతిక సాకులు చూపి దరఖాస్తులను తిరస్కరించడం ఇక్కడ నిత్యకృత్యమైందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో యజమానులను వారాల తరబడి తిప్పుకుంటూ నరకం చూపిస్తున్నారని ఆగ్రహానికి గురవుతున్నారు. ఏజెంట్ల వద్ద కొలతలు పూర్తయి, వారి ముద్ర లేదా ముందస్తు సంతకం ఉన్న ఫైళ్లు మాత్రం క్షణాల్లో ఆమోదం పొందుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుండడంతో మాకు ఈ కేంద్రాలపై నేరుగా తనిఖీలు చేసే లేదా చర్యలు తీసుకునే నిబంధనలు లేవనేది ఆ శాఖ అధికారుల వాదన. ఇప్పటికై నా బంగారుపాళ్యం కేంద్రం వద్ద జరుగుతున్న దోపిడీపై రవాణా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులు ఆ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.
రోజుకు 2,000 పైగా వాహనాలు.. అడ్డగోలు వసూళ్లు
ఇక్కడికి ప్రతిరోజూ జిల్లా నలుమూలల నుంచి సుమారు 2 వేలకు పైగా వాహనాలు ఫిట్‌నెస్ పరీక్షల కోసం వస్తుంటాయి. ఈ రద్దీని ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వాహనా న్ని బట్టి రేటు ఫిక్స్ చేశారు. ఆటోలు, చిన్న రవాణా వాహనాల నుంచి రూ.2 వేలు, హెవీ వాహనాలకు రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైసలు పూజిస్తే తప్ప సర్టిఫికెట్ మంజూరు కావడం లేదని యజమానులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.


