అబ్బురపరిచిన బీఎస్ కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కన్నుల కదలికలతో గణిత చిక్కుముళ్లకు క్షణాల్లో సమాధానాలు
చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక బీఎస్.కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం బీఎస్ కణ్ణన్ 99వ జయంతిని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రగణిత అవధానం విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చాముండి, జ్ఞానప్రియ, శర్వాన్ తమ ప్రజ్ఞాపాఠవాలతో అందరినీ అబ్బురపరిచారు. ప్రేక్షకులు కాగితంపై రాసి ఇచ్చిన గణిత సమస్యలు, గణాలు, వర్గాలు, ఘన మూలాలు, వర్గమూలాలు, వింత చదరాలు, ఆంగ్ల పదాలు, ఆంగ్ల వ్యాక్యాలను దత్తాంశంగా స్వీకరించారు. విద్యార్థిని జ్ఞానప్రియ తన కనుబొమ్మల కదలికల రూపంలో సంకేతాలు ఇవ్వగా, దాని ఆధారంగా శర్వాన్, చాముండి ఆయా ప్రశ్నలకు సరైన సమాధానాలను చదివి విని పించి నేత్రావధానంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.
రెండు విశిష్ట కళల సమాహారం
ఈ కార్యక్రమానికి మెంటార్, సంధానకర్తగా వ్యవహరించిన గణిత ఉపాధ్యాయుడు అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ సాధారణంగా నేత్రావధానం, గణితావధానం వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. రెండింటినీ మేళవించి నేత్రగణిత అవధానంగా ప్రదర్శించడం తమ విద్యార్థుల ప్రత్యేకత అని పేర్కొన్నారు. కన్నన్ పాఠశాల హెచ్‌ఎం కోమల మాట్లాడుతూ గణితం అనేది లెక్కలు మాత్రమే కాదని, అదొక మానసిక వ్యాయామమని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇటువంటి వినూత్న ప్రదర్శనను తాము మొదటిసారి చూస్తున్నామని, విద్యార్థుల అసాధారణ ప్రతిభను, అరుణ శివప్రసాద్ కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ జయంతి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి మునిరత్నం, సభ్యులు మురళి, నరసింహులు నాయుడు, రవికుమార్, కుమారస్వామి, లయన్స్ క్లబ్ గోల్డ్ జోనల్ చైర్మన్ ఎం.వి. శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


