స్థానికంలో పోటీకి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

స్థానికంలో పోటీకి సిద్ధం

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

అన్ని స్థానాల్లో పార్టీ జెండా ఎగరాలి కుప్పంలో జెడ్పీ చైర్మన్‌పై దాడి పాశవికం బలప్రయోగంతో బాబు గెలవాలని కుట్రలు చేస్తున్నారు పార్టీ శ్రేణులు బెదిరింపులకు భయపడరు వైఎస్సార్‌ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన నాయకులకు గుర్తింపు కార్డులు అందజేత ఏం చేశారని జనం కూటమికి ఓట్లేస్తారు మాజీ మంత్రి ఆర్కేరోజా

నగరి/చిత్తూరు కార్పొరేషన్‌/పలమనేరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. నగరి, చిత్తూరు, పలమనేరులోని పార్టీ కార్యాలయాల్లో బుధవారం పార్టీ నమన్వయకర్తలు ఆర్కే రోజా, విజయానందరెడ్డి, వెంకటేగౌడ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమావేశమయ్యారు. పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంతకంతో కూడిన గుర్తింపు కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. అరాచకాలు సృష్టించి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బాబు కుట్రలు పన్నుతున్నారని, వాటిని ధీటుగా ఎదుక్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచి వైఎస్సార్‌ సీపీ జెండాను వాడవాడలా ఎగురవేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు బయటకు రావడానికి మూడేళ్లు పట్టిందన్నారు. అదే తమ పార్టీ మూడు రోజుల్లో బయటికి వచ్చి ప్రజల తరఫున పోరాటాలు చేస్తోందని గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ గుర్తింపు కార్డు జేబులో ఉంటే జగనన్న గుండెల్లో ఉన్నట్టేనని తెలిపారు. ఆ కార్డు ప్రతి సభ్యునికీ ఒక శ్వాస, నమ్మకం, విశ్వాసం, ధైర్యంలా, పోరాట స్ఫూర్తినిచ్చే క జ్వాలలాగా ఉంటుందని తెలిపారు. కేవలం కార్డు కాదని ప్రత్యర్థుల నీచ ధోరణికి వ్యతిరేకంగా ఇచ్చిన ఆయుధమన్నారు.

జగనన్న బాటలో నడవాలి

చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ జగనన్న, కరుణాకరన్న సూచించినట్లు నాయకులు నడుచుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధాన అజెండాగా భావించి పార్టీ క్యాడర్‌ మొత్తం శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. నగరిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు రాహుల్‌రాజారెడ్డి, నగరి, పుత్తూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్లు నీలమేఘం, హరి, మాజీ వైస్‌ చైర్మన్లు జయప్రకాష్‌, వెంకటరత్నం, పుత్తూరు మండల ఎంపీపీ మునివేలు, నగరి, పుత్తూరు మున్సిపల్‌ పార్టీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, ఏకాంబరం, రాష్ట్రకమిటీ నాయకులు కాయం గాంధీ, రవీంద్ర, గుణశేఖర్‌, శేఖర్‌రాజు, శ్యామ్‌లాల్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరులో కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు రెడ్డెప్ప, నాయకులు జ్ఞానజగదీష్‌, రాహుల్‌రెడ్డి, విజయసింహారెడ్డి, కెపి శ్రీధర్‌, ప్రకాష్‌, జయపాల్‌, హరిణిరెడ్డి, త్యాగ, అమర్‌నాథరెడ్డి, రజనీకాంత్‌, ప్రసాద్‌ రెడ్డి, అప్పొజీ, రమణ, చక్రి మురళీ, భాగ్యలక్ష్మి, ఆను, మధురెడ్డి, మధుసూదన్‌, టిమ్ము, నారాయణ, మనోజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలమనేరులో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులు వెంకటరెడ్డి యాదవ్‌, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, పార్టీ అనుభంద విభాగాలు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

జెడ్పీ చైర్మన్‌పై దాడి అమానుషం

జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులుపై శాంతిపురంలో టీడీపీ మూకలు దాడికి యత్నించడం అమానుషమని భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారులో వెళుతుండగా టీడీపీ కార్యకర్తను కిడ్నాప్‌ చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాయడం సిగ్గుచేటన్నారు. ఆ రెండు పత్రికలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై దాడి చేసి కారు అద్దాలు పగులగొడితే టీడీపీ నాయకులను కిడ్నాప్‌ చేశారని జెడ్పీ చైర్మన్‌పై కేసు పెట్టడం పాశవికమన్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడింది రక్తం చిందించైనా ఎన్నికల్లో గెలుద్దామని చెప్పారని, దాన్ని టీడీపీవారి రక్తం చిందిస్తామని పచ్చపత్రికలు రాయడం పద్ధతికాదన్నారు. జరిగిన తప్పుపై టీడీపీ క్షమాపణ చెప్పాల్సిందిపోయి వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులు పెట్టడం చాలా దారుణమన్నారు. యుద్ధానికి ముందు బలి ఇచ్చిన చందాన మేం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ఇలాగే భయపెట్టి చేస్తామని ట్రయల్‌ చూపినట్టుగా కుప్పం సంఘటన కనిపిస్తోందన్నారు. హింస మీదైతే అహింస తమదని, దాడులు మీవైతే వాటిని ఎదుర్కోవడం తమదని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు.

మోసం తెలియని వ్యక్తి రోజమ్మ

మోసం తెలియని, ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉన్న వ్యక్తి రోజా అని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. రోజమ్మకు ఎంత బలాన్ని కూరుస్తున్నారో స్థానిక సంస్థల ఎన్నికలు చెబుతాయన్నారు. అందరూ సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఏం చేశారని జనం కూటమికి ఓట్లేస్తారు

కూటమి పార్టీ నేతలు రెండున్నరేళ్లలో ఏం చేశారని ప్రజలు వారికి స్థానిక ఎన్నికల్లో ఓట్లేస్తారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా మోసమే చేస్తారు. ఆయన జీవితంలో మారరన్న విషయం ప్రజలకు బోధపడిందన్నారు. లోకల్‌ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు జనం సిద్దంగా ఉన్నారని, అందుకే కూటమి నేతలు వైఎస్సార్‌ సీపీ నేతలను బెదిరించి, కేసులు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement