● వాటి స్థానంలో రూ.140, రూ.200 బ్రాండ్ల మద్యం ● మాట తప్పిన సర్కారు.. మద్యం ప్రియులపై భారం ● చాపకింద నీరులా కర్ణాటక మద్యం.. ఊర్లలో ‘నాటు’
సూపర్ సిక్స్ పథకాలంటూ
ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం
అన్ని వర్గాల ప్రజలనూ మోసం
చేసింది. పథకాలను
తూతూమంత్రంగా అమలుచేసి
చేతులు దులుపుకుంది. అలాగే మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలను సైతం
తుంగలో తొక్కేసింది. తాము
అధికారంలోకి వస్తే రూ.99కే మద్యం బాటిళ్లను అందుబాటులో ఉంచి,
కావాల్సినంత మద్యం ఇస్తామని చెప్పిన సర్కారు తొమ్మిది నెలలుగా దీన్ని పక్కన పెట్టేసింది. ప్రీమియం బ్రాండ్లను
తీసుకువచ్చి మద్యం ప్రియులకు
బలవంతంగా అంటగడుతోంది.
తద్వారా రూ.కోట్లు వసూలు చేస్తూ ఖజనాను నింపుకుంటోంది.
సాక్షి, చిత్తూరు: గత ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీని కాదని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం పాలసీని తీసుకువచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి, వాటి స్థానంలో పచ్చ తమ్ముళ్లకు ఉపాధి కల్పిస్తూ ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటుచేసింది. రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సులు జారీ చేసింది. ఇక మాట ఇచ్చామని చెబుతూ మధ్య తరగతి మద్యం ప్రియులకు రూ.99లకే మద్యం బాటిల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మద్యాన్ని తెచ్చిన పది రోజుల్లోనే నిబంధనలు వర్తిస్తాయంటూ 20 శాతం స్టాకు మాత్రమే దుకాణాల్లో ఉంచింది. తొమ్మిది నెలలుగా 20 శాతం కాస్త, 5 శాతానికి పడిపోయింది. రూ.99 మద్యం కోసం దుకాణాలకు వెళ్లే మద్యం ప్రియులకు లభించకుండా చేసేశారు. పేరుకు మాత్రం దుకాణాల్లో స్టాకు చూపించడం, రెండు బాక్సుల అమ్మకాలు పూర్తయ్యాక నో స్టాకు బోర్డు పెట్టడం పరిపాటిగా మారిపోయింది.
యథేచ్ఛగా కర్ణాటక మద్యం విక్రయాలు
మద్యం దుకాణాల్లో రూ.99 మద్యం కనుమరుగు కావడాన్ని కొందరు ఆసరాగా తీసుకున్నారు. నాటు సారా, కర్ణాటక మద్యం విక్రయాలను ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడ చూసినా కర్ణాటక మద్యం ఏరులై ప్రవహిస్తోంది. అదేవిధంగా రూ.99 మద్యానికి ప్రత్యామ్నాయంగా రూ.20 పలికే నాటుసారా తయారీ ఊపందుకుంది. గుడిపాల, పాలసముద్రం, రొంపిచెర్ల, పులిచెర్ల, గంగాధరనెల్లూరు, పలమనేరు, కుప్పం, బిఎన్‌ఆర్.పేట ప్రాంతాల్లో నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంది. ఇక చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దు కావడంతో పలమనేరు, కుప్పం ప్రాంతాలకు కర్ణాటక మద్యం భారీగా దిగుమతి అవుతోంది. కర్ణాటకలో రూ.73లకే టెట్రా ప్యాకెట్ల మద్యం అక్కడి దుకాణాల్లో అందుబాటు ఉండడంతో, దాన్ని భారీ మొత్తంలో జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇక్కడ కర్ణాటక మద్యాన్ని రూ.వందకు విక్రయిస్తూ, అందులో కూడా తమ్ముళ్లే ఉపాధి పొందుతున్నారు. పేదల కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం రూ.99 మద్యం సరఫరాను ఆపేసి, దాని స్థానంలో నాటుసారా, కర్ణాటక మద్యానికి గేట్లు ఎత్తేసి.. అధికార పార్టీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని నిలువరించడంలో ఎకై ్సజ్ శాఖ ఎప్పుడో చేతులు ఎత్తేసింది.


