చిత్తూరు కలెక్టరేట్ : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వలసపల్లి నవోదయ పాఠశాలలో 9, 11 తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ గీత బుధవారం కలెక్టర్‌ను కలిసి అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ అడ్మిషన్ల ప్రక్రియకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 2026–27 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు.
ఆరోగ్య కార్యక్రమాలను
వంద శాతం పూర్తి చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను 100 శాతం లక్ష్యంతో పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు లెప్రసీ ఎల్‌సీడీసీ ద్వారా కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించాలని సూచించారు. కేసీడీ, అభా, సంజీవిని, ఆర్‌బీఎస్‌కే సర్వేల్లో పురోగతి పెంచి, ఈ వారంలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. పీహెచ్‌సీ గ్రేడింగ్, ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వీహెచ్‌సీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, సిబ్బంది ఈఎస్‌ఆర్ అప్‌డేషన్‌ను ఈ నెలలోనే ముగించాలని ఆదేశించారు. గురువారం మెసానికల్ గ్రౌండ్‌లో నిర్వహించే ెఎయిడ్స్ అవగాహన మారథాన్‌లో 17–20 ఏళ్ల యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు ఇస్తామన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌ఓ వెంకట ప్రసాద్, డీపీఎంఓ డాక్టర్ ప్రవీణ పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికలకు జెడ్పీ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జెడ్పీ కార్యాలయంలో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాత ఏఓ కార్యాలయాన్ని వీటి కోసం వినియోగిస్తున్నారు. వీటిని పర్యవేక్షించడానికి ఏఓ, సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టు, అటెండర్లకు డ్యూటీలు కేటాయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను ఇక్కడి నుంచి పర్యవేక్షించనున్నారు. జెడ్పీ పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన ఎన్నికల సమాచారాన్ని అధికారులు ఇక్కడ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ నెల 24వ తేదీతో జెడ్పీ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. 25 నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొత్త జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి.
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్
పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ సబ్ జూనియర్, జూనియర్ జట్ల ఎంపిక పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ వైస్ చైర్మన్ షణ్ముగం తెలిపారు. ఎంపికై న సబ్ జూనియర్ జట్లు ఈ నెల 12 నుంచి 14 వరకు బొబ్బిలి (విజయనగరం)లో, జూనియర్ జట్లు అక్టోబర్ 12 నుంచి 14 వరకు పుల్లంపేట (కడప)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి మల్లేశ్వరి వెల్లడించారు. క్రీడాకారులు పట్టుదలతో ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.


