లబ్ధిదారుల సొమ్ము బినామీ ఖాతాల్లోకి మళ్లింపు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తుతున్న ఫిర్యాదులు బయటకు పొక్కడంతో గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్లు
యాదమరి: కొందరు అక్రమార్కులు ఉపాధి కూలీల పొట్టగొడుతున్నారు. ఉపాధి హామీ కింద మంజూరైన మామిడి చెట్ల నిధులను పక్కదారి పట్టించారు. నిరుపేద అర్హులైన రైతులకు దక్కాల్సిన సొమ్మును క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు తమకు కావాల్సిన బినామీల వారి ఖాతాల్లోకి మళ్లించి కుంభకోణానికి పాల్పడారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు స్వాహా చేసినట్టు బాధిత రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద రైతులకు మేలు చేసేందుకు ఈ పథకం కింద మామిడి మొక్కలు నాటుకునే అవకాశం కల్పించారు. సిబ్బంది అవినీతి వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది.
అడిగితే త్వరలో వస్తుంది అంటూ బుకాయింపు
పంట సాగు చేసుకున్న రైతుల నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల పత్రాలను సేకరించిన సిబ్బంది కొందరు అధికారులతో కుమ్మకై ్క నిధుల బదిలీలో అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు రావలసిన నగదు గురించి రైతులు నిలదీస్తే ‘ఇంకా డబ్బులు పడలేదు.. త్వరలోనే వస్తాయి అంటూ ఉపాధి హామీ సిబ్బంది పచ్చి అబద్దాలతో కాలయాపన చేస్తూ వచ్చారు. తీరా అనుమానం వచ్చి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోగా తమ డబ్బులు వేరే వారి అకౌంట్లలోకి బదిలీ అయినట్లు తేలడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై మండలంలోని సంబందిత అధికారులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం రావడంతో బాధితులు కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను ఆశ్రయించారు. కొన్ని వారాలుగా ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందుతుండడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఇరకాటంలో పడిన సదరు ఉపాధి సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా బాధిత రైతులకు సొంతంగా డబ్బులు సర్దుబాటు చేస్తూ సెటిల్‌మెంట్లకు దిగుతున్నారని ఈ వారం డబ్బులు తీసుకున్న ఓ బాధితుడు చెప్పాడు. మండలంలో అసలు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన నిధులు ఇతరుల ఖాతాల్లోకి ఎలా మళ్లించారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఇప్పటి వరకు ఎంతమంది రైతుల పొట్టగొట్టారు? అనే వాటిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని, అవినీతి సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


