ఆసుపత్రిలో పసికందును వదిలి వెళ్లిన తల్లి బరువు తక్కువగా ఉందన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ శిశువిహార్‌కు అప్పగింత రంగంలోకి దిగిన పోలీసులు, సీసీ పుటేజీల పరిశీలన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో.. తాను ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలియదు. మనసును రాయి చేసుకుంది. కన్నీటిని గుండెల్లోనే దిగమింగుకుంది. నవమాసాలు మోసి కన్న మగబిడ్డను వద్దనుకుంది. చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వదిలేసి వెళ్లిపోయింది. బుధవారం వేకువజామున ఆసుపత్రిలోని ప్రసూతి విభాగం వెనుక భాగంలో రోదిస్తున్న మగబిడ్డను స్థానిక సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వైద్యులు తక్షణమే ఆ బిడ్డను స్వాధీనం చేసుకుని, అత్యవసర చికిత్స నిమిత్తం ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో చేర్చారు. బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతం క్షేమంగానే ఉందని, బరువు కాస్త తక్కువగా ఉండడంతో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. ఆసుపత్రి అధికారుల సమాచారం మేరకు ఆ పసికందును సురక్షితంగా శిశువిహార్‌కు అప్పగించారు. బిడ్డను బయటి నుంచి తెచ్చి వదిలిపెట్టినట్లు తెలుస్తోందని, ఆస్పత్రిలో ఉన్నవాళ్లు ఈ పనిచేయలేదని ఆస్పత్రి అధికారులు వెల్లడిస్తున్నారు.
పోలీసుల విచారణ
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. ఆ పసికందును వదిలివెళ్లిన తల్లి ఎవరు? ఏ సమయంలో ఆసుపత్రిలోకి వచ్చి వెళ్లారనే అంశాలపై ఆసుపత్రి ప్రాంగణంలోని సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సమస్యల వల్ల మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక పిల్లలపై విరక్తితో వదిలేసి వెళ్లారా? అసలు మగ్గ బిడ్డను వదిలి వెళాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
ఆ బిడ్డను వదిలిపెట్టిందా.. ఆ ఇద్దరేనా..?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నవజాత శిశువును వదిలి వెళ్లిన ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం రాత్రి ఆసుపత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా సంచరించిన ఆ యువతీయువకులే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బిడ్డను వేరే ఎక్కడో కాకుండా సరిగ్గా వన్‌స్టాప్ సెంటర్‌కు అత్యంత సమీపంలోనే వదిలి వెళ్లడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఆ రాత్రి అక్కడే సంచరించిన ఆ ఇద్దరూ ముందుగా ప్లాన్ చేసుకునే పసికందును అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని వన్‌స్టాప్ సిబ్బంది భావిస్తున్నారు. ఘటనపై టూ టౌన్ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తూ, ఆ రాత్రి సంచరించిన ఆ జంట ఎవరనేది గుర్తించేందుకు గాలిస్తున్నారు.


