చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణతో ఆర్‌టీసీ ఉనికికి, ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదమని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం చిత్తూరులోని రెవెన్యూ భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వి.మోహన్ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రమణారెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో రాష్ట్రంలో ఇప్పటికే ఆరు డిపోలు మూతపడ్డాయని, మరో కొన్ని డిపోలు కూడా మూతబడే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ బస్సుల నెపంతో ఆర్టీసీ ఉద్యోగులే లేకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. చిత్తూరు– 1, చిత్తూరు–2 డిపోలతో పాటు తిరుపతిలోని మంగళం డిపోను యథావిధిగా కొనసాగించాలని, ఆయా డిపోల ఉద్యోగులను తిరిగి అక్కడికే తీసుకొచ్చేలా యూనియన్ తరఫున పోరాడుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినా ఆర్టీసీ ఉద్యోగులకే శిక్షణ ఇచ్చి పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఎండీకి విన్నవించినట్లు వివరించారు. సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకర్‌రెడ్డి, కడప జోనల్ అధ్యక్షుడు వినోద్‌బాబు, జోనల్ సంయుక్త కార్యదర్శి బాషా, జోనల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి మురుగన్, చిత్తూరు జిల్లా చైర్మన్ రాజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్, వైస్ ప్రెసిడెంట్ సంపూర్ణ, జిల్లా కార్యదర్శి ఆరణి ఉపేంద్ర, సంయుక్త కార్యదర్శి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.


