చిత్తూరు కలెక్టరేట్ : వినాయక చవితి ఉత్సవ ఏర్పాట్లకు సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ ద్వారా సులభతరంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆర్‌డీఓ శ్రీనివాసులు తెలిపారు. సోమవా రం ఈ మేరకు చిత్తూరు డివిజన్ పరిధిలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌డీఓ మాట్లాడుతూ చిత్తూరు డివిజన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో చేపట్టాలన్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను శాఖల సమన్వయంతో పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. నిర్వాహకులు అనుమతుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ నెల 13వ తేదీ లోపు సమర్పించాలన్నారు. విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ఈ నెల 24 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసే క్రమంలో ప్రధా న రహదారులను పూర్తిగా మూసివేయకూడదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు, అత్యవసర వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. డీఎస్పీ వెంకట నారాయణ మాట్లాడుతూ ఉత్సవాల్లో డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని చెప్పారు. మహిళలు, పిల్లలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున మండపాల వద్ద కమిటీ సభ్యులే బాధ్యతగా వలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. వర్షాభావం, నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారీ విగ్రహాల జోలికి వెళ్లకుండా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వినాయక ఉత్సవ కమిటీ కన్వీనర్ అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.


