కూటమిపై సమరానికి వైఎస్సార్‌సీపీ సమాయత్తం | - | Sakshi
Sakshi News home page

కూటమిపై సమరానికి వైఎస్సార్‌సీపీ సమాయత్తం

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

● ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు ● గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం ● విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి ● 18న అరణియార్‌ సందర్శనకు భూమన పిలుపు

● ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు ● గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం ● విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి ● 18న అరణియార్‌ సందర్శనకు భూమన పిలుపు

‘‘అలవి కాని హామీలు గుప్పించి చంద్రబాబు అధికారం చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. అవినీతికి పెద్దపీట వేసి స్కామ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమాయత్తం కావాలి. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోరాట పటిమను ప్రదర్శించాలి. పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలో దించాలి. చంద్రబాబు అక్రమాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి. సర్కారు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, నేతలకు దిశానిర్దేశం చేశారు.

తిరుపతి రూరల్‌ : స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కూటమిని ఢీకొట్టేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ జగనన్న చేసిన పనులను సైతం తన ఖాతా వేసుకుని క్రెడిట్‌ చోరీ చేసేందుకు చంద్రబాబు తెగబడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజల్లో తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రధాన అస్‌త్రంగా మార్చాలని కోరారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్‌ మాట్లాడుతూ సమన్వయకర్తలు విస్తృతంగా పర్యటించి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని, పోరాటాల పార్టీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంటు పరిశీలకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పార్టీ నేతలు చూపించిన చొరవను స్థానిక ఎన్నికల్లో కూడా చూపించాలన్నారు. అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని జగనన్నకు కానుకగా అందించాలని సూచించారు.

వెన్నుపోటు బాబు నైజం

వెన్నుపోటు అనేది చంద్రబాబు సహజ నైజమని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లోకేష్‌ నుంచి ముఖ్యమంత్రి పీఠం కాపాడుకునేందుకు డీఎస్సీ అక్రమాలకు లీక్‌ చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. తన సీటును రక్షించుకునేందుకు చంద్రబాబు ఎవరినైనా తొక్కేసేందుకు వెనుకాడరని విమర్శించారు. ఇప్పుడు డీఎస్సీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటే లోకేష్‌ అవినీతి బాగోతం బయటపడుతోందని స్పష్టం చేశారు.

బాబు పాలనలోనే కరువు

చంద్రబాబు ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరువు వస్తుందని, ఈ కరువు తీరాలంటే బాబు ప్రభుత్వం పోవా లని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. పల్లెల్లో తాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయని, జలాశయాలన్నీ ఎండిపోతున్నాయని, భూ గర్భ జ లాలు అడుగంటి పోయాయని వివరించారు. అందుకే వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదు రుచూస్తున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడి జగనన్న ఆశయ సాధన కోసం స్థానిక ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పోరాడా లని కోరారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్లా స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ కుప్పంలో పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, అయినా సరే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే లు వెంకటేగౌడ, డాక్టర్‌ సునీల్‌ మాట్లాడుతూ ఏకగ్రీవాలకు తావు లేకుండా అన్ని చోట్లా పోటీ పెట్టి విజయం దిశగా నడిపిస్తామన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా గడిపారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తిరుపతి, చంద్రగిరి, జీడీనెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కృపాలక్ష్మి, నూకతోటి రాజేష్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేసేందుకు నేతలు పోటీలు పడుతున్నారన్నారు. ప్రతి పంచాయతీలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తామని స్పష్టం చేశారు.

సీమకు తీరని అన్యాయం

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాయలసీమ నుంచి కీలక సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీతో పాటు 16 మేజర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తూ పేదల ఆర్థికాభివృద్ధిని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, జగనన్న రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఈవీఎంలను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికల్లో మరోసారి కుట్రలకు తెగబడితే కలసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement