వేసవిని తలపిస్తూ ఉష్ణోగ్రతల నమోదు వేడిమి.. ఉక్కపోతకు అల్లాడుతున్న జనం భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
పెరిగిన విద్యుత్ వాడకం
గత 40 రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకున్న విపరీతమైన మార్పులు ప్రజల జీవన విధానంలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ ఆగస్టు–సెప్టెంబరు నెలల్లో రాత్రి వేళల్లో పెద్దగా ఏసీలు వాడే పరిస్థితిలేదు. కానీ తాజాగా ఏసీలు ఉన్న ప్రతి ఇంట్లోనూ రాత్రింబవళ్లు తప్పకుండా వాడాల్సి వస్తోంది. ఈ వేసవి సమయంలో మే నెలలో జిల్లాలో అత్యధికంగా 331.18 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించగా ఆగస్టు నెలలో ఏకంగా 410 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విద్యుత్ అధికారులు సైతం ఈ గణాంకాలను చూసి షాక్‌కు గురవుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతం గ్రీష్మ రుతువు నడుస్తోందన్నట్టు ఉంది వాతావరణం. వర్షాకాలం ముదిరి వానలు దంచి కొట్టాల్సిన ఆగస్టులోనూ ఎండలు అగ్నిగుండంలా మాడుస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు భగభగమంటున్నాడు. మే–జూన్‌లో వచ్చే రోహిణి కార్తెలో రోళ్లు పగిలిపోతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పుడున్న ఎండలకు పుర్రెలే పలిగిపోతాయేమో అనేంతగా భయం వేస్తోంది. మృగశిరలో చిరు జల్లులు కురవాలని, శ్రావణం తరువాత విస్తారంగా వర్షాలు పడతాయని రుతువుల గురించి మనం పాఠ్యాంశాల్లో చదుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటీటీల్లో వచ్చే వెబ్–సిరీస్ సీజన్–2ను తలపించేలా ఉంది జిల్లాలో సూర్యుడి ప్రతాపం.
సీజన్–2.ఓ!
చిత్తూరు: చిత్తూరు నగరం నుంచి కుప్పం వరకు గత నెల రోజులుగా ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే చిత్తూరు లాంటి ప్రదేశాల్లో సూర్యుడి ఎండ ధాటిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. సూర్య నమస్కారాలు చేసే సమయంలోనూ భానుడిని తలెత్తి చూసే పరిస్థితి కనిపించడంలేదు. ఇక ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ ఎక్కువగా కాస్తోంది. వేడి గాలులు, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పలమనేరు దాటుకున్న తరువాత కుప్పం వరకు ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతూ ఉంటా యి. గత 40 రోజులుగా ఈ ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. చిత్తూరుతో పోలిస్తే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవడం తప్ప.. వేడిమిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఎక్కడా కూడా పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు తగ్గడంలేదు. చిత్తూరులో గత రెండు రోజుల్లో ఏకంగా 38, 39 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదుకావడం వేసవి రికార్డులను బద్దలు కొడుతోంది.
వెలవెలబోతున్న నిత్యం రద్దీగా ఉండే కాణిపాకం–తిరుపతి బైపాస్ రోడ్డు
ఎండల తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన చిత్తూరులోని గాంధీ రోడ్డు
జిల్లాలో బెంబేలెత్తిస్తున్న ఎండలు
జిల్లాలో గత వారం నమోదైన ఉష్ణోగ్రతలు డిగ్రీల్లో
1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ
37 39 36 36.5 38 39.5


