చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీ ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు ఆదివారం ముగిశాయి. జిల్లాలోని 27 మండలాలు 622 పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉండగా అందులో 7,52,331 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో ప్రకటించారు. వాటిని పంచాయతీల వారీగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించారు. గత 5 రోజులుగా పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి ఓటర్ల జాబితాపై విచారణ చేశారు. ఇందులో ఆమోదం పొందినవి తుది జాబితాగా సిద్ధం కానున్నాయి. వాటిని సోమవారం కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అందజేయనున్నారు. ఆయన ఆమోదం తెలిపితే అదే రోజు ప్రకటించనున్నట్లు డీపీఓ సుధాకర్‌రావు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,176 మంది స్వామిని దర్శించుకున్నారు. 36,673 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లున్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు.


