జెడ్పీ కార్యాలయాల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ కార్యాలయాల గుర్తింపు

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

తిరుపతి చంద్రగిరిలో ఎంపీడీఓ కార్యాలయం మదనపల్లెలో జెడ్పీ బంగ్లా 25 నుంచి కొత్త కార్యాలయాల నుంచి పాలన ఘనచరిత్ర ఇక గతం

చిత్తూరు కార్పొరేషన్‌: ఈ నెల 24వ తేదీతో ఉమ్మడి చిత్తూరు జెడ్పీ పాలకవర్గం గడువు ముగియనుంది. కొత్త పాలక వర్గాలను ఎన్నుకోకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రావు. తద్వారా పల్లెల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం విధిలేక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 25 నుంచి జెడ్పీ పాలన కొత్త జిల్లాల నందు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా చిత్తూరు కేంద్రంగా సాగుతున్న ఉమ్మడి జిల్లా జెడ్పీ పాలన ఇక మారనుంది. మరో 17 రోజుల్లో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొత్త జెడ్పీ కార్యాలయాల నుంచి పాలన ప్రారంభించనున్నారు. అందుకుగాను తిరుపతిలో చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయం, మదనపల్లెలో జెడ్పీ బంగ్లాలో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలను నియమించనున్నారు.

రిజర్వేషన్‌పై ఉత్కంఠ

జెడ్పీల విభజన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. అందులో భాగంగా జిల్లాల వారిగా జెడ్పీటీసీ, చైర్మన్ల పరంగా రిజర్వేషన్‌ చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. గతంలో చిత్తూరు జిల్లా బీసీకి రిజర్వు అయిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో 65 జెడ్పీటీసీలు, 877 ఎంపీటీసీలు ఉన్నారు. ఆ లెక్కన తీసుకుంటే చిత్తూరు జిల్లాకు 27 జెడ్పీటీసీలు, తిరుపతి జిల్లాకు 19, అన్నమయ్య జిల్లాకు 19 మంది జెడ్పీటీసీలు వస్తారు. చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య 370, తిరుపతి జిల్లాలో 253, అన్నమయ్య జిల్లాలో 254 మంది వస్తారు. కొత్త జెడ్పీల ప్రతిపాదికన చిత్తూరు జిల్లాలో 27 జెడ్పీటీసీలు, తిరుపతి జిల్లాలో 35 జెడ్పీటీసీలు, అన్నమయ్య జిల్లాలో 25 జెడ్పీటీసీలు వస్తారు.

ఉద్యోగుల పంపకం

జెడ్పీ పరిధిలో వివిధ కేటగిరీల కింద మొత్తం 650 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు 130 మంది, ఏఓలు 79 మంది, ఎస్‌ఏలు 135 మంది, జేఏలు, టైపిస్టులు 350 మంది, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్‌మెన్లు, డ్రైవర్లు 275 మంది ఉన్నారు. వారిలో సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి సీనియర్లను పాత జిల్లాలో ఉంచి జూనియర్లను కొత్త జిల్లాలకు నిష్పత్తి ప్రకారం పంపనున్నారు.

109 ఏళ్ల భవనం

చిత్తూరులోని జెడ్పీ కార్యాలయాన్ని 1917 జనవరి 18న అప్పటి ఐపీఎస్‌ అధికారి బ్రెయిడ్‌ఉడ్‌ ప్రారంభించారు. 109 సంవత్సరాలుగా ఉన్న ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. అప్పటి కాలం ఇంజినీర్లు, పనివిధానానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఇప్పటి మరమ్మతులు చేస్తున్నా పెద్ద స్థాయిలో ఏమీ చేయలేదు. అప్పటి కాలం తలుపులు, కిటీకీలు మార్చకుండా వాడుతున్నారు.

మదనపల్లెలోని బంగ్లాలో ఏర్పాటు కానున్న అన్నమయ్య జిల్లా జెడ్పీ

చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు కానున్న తిరుపతి జెడ్పీ కార్యాలయం

1962

నుంచి

మనుగడలో

1959లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ సమితి, జిల్లా ప్రజా పరిషత్‌ చట్టం ప్రకారం చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్‌ ఏర్పడింది. అంతకుముందు బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 – 59 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. జెడ్పీల పాలకవర్గం ఎన్నికయ్యాక 1962లో అద్దూరి బలరామరెడ్డి మొదటి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. గత 64 సంవత్సరాల్లో 31 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. అందులో 12 మంది స్పెషల్‌ ఆఫీసర్లుగా కలెక్టర్లు, జేసీలు పాలన కొనసాగించారు. వరుసగా చూస్తే రెడ్డివారి నాదమునిరెడ్డి, నాగిరెడ్డి, రామలింగారెడ్డి, విశ్వనాథరెడ్డి, రామస్వామి, కుతూహలమ్మ, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్‌, రామేగౌడు, శ్రీనాథరెడ్డి, శ్రీనివాస్‌, సిద్దరామరెడ్డి, గోవిందస్వామి, రెడ్డెమ్మ, సుబ్రమణ్యంరెడ్డి, కుమార్‌రాజా, గీర్వాణి పనిచేశారు. ఉమ్మడి చివరి జెడ్పీ చైర్మన్‌గా గోవిందప్ప శ్రీనివాసులు పనిచేస్తున్నారు. అలాగే ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు రాజాజీ, రామకృష్ణయ్య, సంపత్‌, సుబ్బారావు, జనార్దన్‌నాయుడు, ఆనంద్‌, వెంకటేశ్వర్లు, సాల్మన్‌ఆరోగ్యరాజ్‌, రాంగోపాల్‌, నారాయణభరత్‌గుప్తా, మార్కండేయులు, హరినారాయణన్‌ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు 65 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతి నిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని పరిస్థితుల ఆధారంగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. అధికారులు ఎన్నికలకు సిద్ధమవుతూ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement