చిత్తూరు రూరల్ (కాణిపాకం ): పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు వసతులు కనుమరగయ్యాయి. లీటరు ఇంధనానికి రూ.వందలు గుంజుతున్న నిర్వా హకులు కనీస వసతులు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 146 పెట్రో ల్ బంకులు ఉండగా, వీటిలో అత్యధిక శాతంలో కనీస సౌకర్యాలు కల్పించలేదని పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీల్లో తేలింది. జిల్లాలోని జాతీయ రహదారులు సహా అంతర్రాష్ట్ర సరిహద్దు మార్గాల్లో రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఇంధన విక్రయాల ద్వారా కాసుల పంట పండించుకుంటున్న యంత్రాంగాలు అత్యవసర వసతులకు బొందపెట్టాయి. జిల్లాలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో మరుగు దొడ్ల నిర్వహణ కనిపించడం లేదు. ప్రయాణికులు అడిగితే తాళం చెవులు ఇవ్వకపోవడం లేదా లోపల శుభ్రత లేక దుర్వాసన వెదజల్లుతుండటంతో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బోర్డులకే పరిమితమైన ఫ్రీ ఎయిర్
పలు బంకుల్లో ఉచిత గాలి సౌకర్యం పేరుకే తప్ప అమలులో లేదు. మెజారిటీ బంకుల్లో ఎయిర్ పంప్ పనిచేయడం లేదు అనే బోర్డులు వేలాడదీయడం లేదా ఆపరేటర్లను అందుబాటులో ఉంచకపోవడం పరిపాటిగా మారింది.
తాగునీటి సౌకర్యం నిల్
మండుతున్న ఎండలు, ప్రయాణ అలసట నుంచి ఉప శమనం పొందేలా బంకుల్లో తాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉన్నా శుద్ధి చేసిన నీరు అటుంచి కనీసం మూతలున్న డ్రమ్ములు కూడా ఏర్పాటు చేయడం లేదు.
కాగితాలకే పరిమితమైన భద్రత
ప్రమాదాలు సంభవిస్తే ఆర్పేందుకు ఉంచాల్సిన ఫైర్ ఎక్స్‌టింగిషర్లు కాగితాలకే పరిమితమయ్యాయి. కాలం చెల్లిన సిలిండర్లు, ఖాళీ ఇసుక బకెట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 146 పెట్రోల్ బంకుల్లో నిబంధనలు పాటించడం లేదని అధికారుల తనిఖీల్లో తేలినా చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత కనిపిస్తోంది. తక్షణమే అధికారులు స్పందించి బంకుల్లో కనీస సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భారీ జరిమానా విధించడంతో పాటు అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.


