చిత్తూరు రూరల్ (కాణిపాకం): యాదవుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కంకణబద్దులు కావాలని అఖిల భారత యాదవ మహాసంఘం నాయకులు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని ఓ భవనంలో ఆదివారం జిల్లా అఖిల భారత యాదవ మహా సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు నవీన్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు బుసగాని లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువాటి వెంకట మునియాదవ్, ఉపాధ్యక్షుడు ఓబులరెడ్డి యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవుల గోపియాదవ్, రాయలసీమ జోన్ మహిళా అధ్యక్షురాలు గాయత్రి యాదవ్, ప్రచార కార్యదర్శి చాట మునిరాజా యాదవ్, తిరుపతి టౌన్ అధ్యక్షుడు గాలం వెంకటేష్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో ఉభయం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో యాదవులకు ఒకరోజు ఉభయం కేటాయించాలని తీర్మానించారు. చిత్తూరు గోపాలపురంలోని చిత్తూరు యాదవ కల్చరల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్‌లో అఖిల భారత యాదవ మహా సంఘం జిల్లా సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. అలాగే 12 వేల చదరపు అడుగుల స్థలంలో యాదవ భవన్, కల్యాణ మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి యాదవులు అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. పోటీ చేసే యాదవ అభ్యర్థుల గెలుపునకు మహాసంఘం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో యాదవులపై దాడులు జరిగితే బాధితులకు సంఘం అండగా నిలిచి పోరాడుతుందని వెల్లడించారు. అలాగే బీసీల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు కోదండ యాదవ్, ఉపాధ్యక్షులు ఎం.కోదండ యాదవ్, జనార్దన్ యాదవ్, వాసు యాదవ్, లక్ష్మీపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి యాదవ్, ప్రధాన కార్యదర్శి ప్రతిభ యాదవ్, ఉపాధ్యక్షురాలు కుమారి యాదవ్, పలు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


