చెరువులకు సెలవుల గండం
కార్వేటినగరం: కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ సెలవు రోజులు వస్తే చాలు చెరువులు, వాగులు, వంకలు, గుట్టలను చెరబడుతున్నారు. జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గత వారం సిద్దేశ్వర గుట్టను గుండు కొట్టారు. ఈ వారం ఎస్టీకాలనీ సమీపంలో ఉన్న పద్మసరస్సు చెరువును చెరబట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం వల్లే జేసీబీ యజమానులు మట్టి తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లేకుంటే వారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాలను ఆపకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అభినందనీయం
చిత్తూరు కలెక్టరేట్ : బోధనలో చూపిన ప్రతిభ, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, బోధనారంగంలో అందించిన విశేష సేవలకు గాను సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మల్లేపు రుక్మిణికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ నెల 5న ఆమె విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఆమెను ఆదివారం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు అధ్యాపకులు రాష్ట్ర స్థాయి అవార్డుకు దరఖాస్తు చేసుకోగా రుక్మిణికి మాత్రమే అవార్డు దక్కింది. ఆమె ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 8 ప్రధాన సదస్సులు నిర్వహించారు. 2 పుస్తకాలను రాశారు. 6 గ్రంథాలకు సంపాదకురాలిగా వ్యవహరించారు. వివిధ అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్‌లో 75కి పైగా పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. రూ.23,18,700 అంచనా వ్యయంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసి విద్యా, పరిశోధనా రంగంలో ప్రత్యేకతను చాటుకున్నారు.


