పలమనేరు: సాహిత్యంతోనే సమాజ చైతన్యం సాధ్యమని, అలాగే సాహిత్యం సమాజానికి విలువైన కానుకలా ఉండాలని తిరుపతి వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్యరాణి సదాశివ మూర్తి తెలిపారు. పలమనేరు పట్టణంలోని కళామందిరంలో ఆదివారం జొన్నవిత్తుల సాహిత్య స్పూర్తి పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామక్రిష్ణ శర్మ రచించిన శబరి శ్రీరాముడు గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ గ్రంథంలో భారతీయ తాత్విక చింతనలోని ఔన్నత్యం కనిపిస్తోందన్నారు. జొన్నవిత్తుల రామక్రిష్ణశర్మ సాహిత్యం భవిష్యత్తు తరాలకు విలువైన కానుకని కొనియాడారు. అనంతరం రామకృష్ణమ్మ, లక్ష్మీ సరసమ్మల జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని యువ కవి పరిమి పరామనాథ్‌కు అందజేశారు. యువ రచయిత రాసిన హృదయావి గ్రంథ పరిచయాన్ని ఆముదాల మురళి చేపట్టారు. కార్యక్రమంలో ప్రముఖ రచయితలు కే రాజ్యలక్ష్మి, కట్టమంచి బాలకృష్ణారెడ్డి, పలమనేరు బాలాజీ, దేవేంద్రాచారి. రజిని, మిఠాయు యుగంధర్, కు మారస్వామి రెడ్డి, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.


