నగరి : మిల్క్‌ప్రొడెక్ట్‌లు తయారుచేసే పాల ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వాయువులతో ఇబ్బందిపడుతున్నామని వీకేఆర్‌పురం గ్రామస్తులు శనివారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న గాలిని పీల్చితే ముక్కులో మంటగా ఉంటోందని, శ్వాస తీసుకోలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి అందక వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీలోకి పాల ట్యాంకర్లు, ఇతర వాహనాలు వెళ్లకుండా దారిని జేసీబీతో తవ్వేశారు. దీంతో ఫ్యాక్టరీలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్యాంకర్లు రోడ్డుపైనే ఆగిపోయాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వాయువులపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమోనియం నైట్రేట్ వంటి హానికర వాయువులు వెలువడుతున్నాయేమోనని ఆందోళనగా ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాయు కాలుష్యంపై పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాల ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. ఎనిమిది నెలలుగా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నామని, ఇంతకాలం ఎలాంటి సమస్య లేవని తెలిపింది. అయితే ఒక నివాస ప్రాంతానికి ఇబ్బంది కలుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ మేరకు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్యాక్టరీ యాజమాన్యం, కూలీలు, గ్రామస్తులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.


