సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరులోని అధికార పార్టీ నేతల్లో ప్రస్తుతం సంకుల సమరం రాజుకుంది. మునిసిపల్ ఎన్నికలపై జరుగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. చిత్తూరు మేయర్ పీఠం తమకే.. కాదు తమ సామాజిక వర్గానికే.. అంటూ మూడు ప్రధాన సామాజిక వర్గాల మధ్య చిచ్చు అంటుకుంది. దీనికితోడు ఓ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కుర్చీ మీదే అని ఒకరికి.. మీకే అంటూ మరొకరికి హామీలు ఇచ్చేస్తుండడం ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
స్పష్టత ఏదీ..?
మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఇదిగో.. అదిగో, ఇప్పుడే.. అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయమంటూ ఏమీ చెప్పడంలేదు. వార్డుల పునర్విభజనపై హైకోర్టులో ఉన్న కేసులు కొట్టేసినా, ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ), వార్డుల వారీగా బీసీ ఓటర్ల వివరాలు, ఎస్‌ఐఆర్‌లో చిత్తూరు కార్పొరేషన్ నుంచే దాదాపు 20 వేలకు పైగా ఓట్లు తొలగించడంపై ఇప్పటికే హైకోర్టులో వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలపై ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేకనే.. ఆర్భాటం చేస్తోంది.
మాకంటే మాకే..!
ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం ఓవైపైతే.. చిత్తూరు మేయర్ కుర్చీపై ఇప్పటికే అధికార పార్టీ నేతల్లో అసంతృప్తులు మొదలయ్యాయి. చిత్తూరులో ఉన్న మూడు ప్రధాన సామాజిక వర్గాలు మేయర్ కుర్చీపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చిత్తూరులో పర్యటించి, ఇద్దరు నేతల ఇళ్లకు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటికి, కాజూరు బాలాజీ ఇళ్లకు ఒకేరోజు వెళ్లారు. ఇది ఇద్దరికీ మేయర్ కుర్చీపై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా తమ నాయకుడికే మేయర్ కుర్చీ అంటూ ఇరువైపులా ఉన్న కార్యకర్తలు దీమాగా ఉన్నారు. తాజాగా నాయుడు బిల్డింగ్స్‌లోని ఓ టీడీపీ నేత ఇంట్లో చిత్తూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, మరో నాయకుడు, మేయర్ కుర్చీ ఆశిస్తున్న అధికారపార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి భేటీ అయినట్లు సమాచారం. మేయర్ మీకే ఇప్పిస్తామని చెప్పడంతో ఆ పలుకు వినడానికే బాగుందని పొంగిపోయిన ఓ సామాజికవర్గ నేత, తన భార్యను పోటీలో పెట్టడానికి నిర్ణయానికి సైతం వచ్చేశారు. ఇలా చిత్తూరులో మూడు సామాజిక వర్గాలు మేయర్ కుర్చీపై ఊహల్లో విహరిస్తున్నా., ఎవరికి సీటు దక్కుతుందోనని అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు.
సీకే నివాసంలో విందులో పాల్గొన్న
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
తన ఇంటికి వచ్చిన మంత్రికి పుష్పగుచ్చం ఇస్తున్న కాజూరు బాలాజీ
వీళ్లు గుర్తులేరా ?
మేయర్ స్థానం ఎవరికి రిజర్వు కానుందనే కనీస ఆలోచనలు కూడా లేకుండా పచ్చ నేతలు ఊహల్లో తేలుతుండడం, అదే పార్టీలోని ఇతర సామాజికవర్గా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరు నగరంలో వన్నెకుల క్షత్రియ ఓట్లు వేలల్లో ఉన్నాయని, ఇక్కడ గెలుపును ఖరారుచేసేది తమ సామాజికవర్గమనే విష యం గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. మేయర్ పోటీకి తామేమీ తక్కువ కాదని చెబుతున్నారు. ఇదే సమయంలో కుర్చీ ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ యితే తాము ఎవరినీ రంగంలోకి దింపాలనే విషయా న్ని కూడా ఆలోచించలేదు. మొత్తంగా మునిపోల్స్ ప్రచారం చిత్తూరులోని తమ్ముళ్ల మధ్య తేనె తుట్టెను కదిపి, సంకుల సమరానికి ఆజ్యం పోసినట్లయ్యింది.


