రేపు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ముఖ్య సమావేశం | - | Sakshi
Sakshi News home page

రేపు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ముఖ్య సమావేశం

Sep 5 2026 1:56 AM | Updated on Sep 5 2026 1:56 AM

కాణిపాకం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై వైఎస్సార్‌సీపీ చిత్తూ రు, తిరుపతి జిల్లాల నేతల ముఖ్య సమావేశం ఆదివారం తిరుపతిలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌న్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఏఐఆర్‌ బైపాస్‌ రోడ్డులోని పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి హాజరయ్యే ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌, మేయర్‌, రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

నేడు జిల్లా స్థాయి గురుపూజోత్సవం

చిత్తూరు కలెక్టరేట్‌ : డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 5 వ తేదీ జిల్లా స్థాయి గురు పూజోత్సవం నిర్వహించనున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాస్థాయి గురుపూజోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులు 72 మందిని సత్కరించి అవార్డులు అందజేస్తామని డీఈవో వెల్లడించారు.

10, 11 తేదీల్లో

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : అభివృద్ధి, పలు కార్యక్రమాల సమీక్షకు ఈ నెల 10, 11 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌కు ఉత్తర్వులు అందాయి. సీఎం అధ్యక్షతన నిర్వహించే ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని పలు కార్యక్రమాల పురోగతి, పలు సమస్యల నివేదికలను సిద్ధం చేసే పనిలో కలెక్టరేట్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

కాణిపాకంలో భక్తుల కిటకిట

కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం శుక్రవారం కృష్ణాష్టమి సెలవుదినం కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లు, దర్శన ప్రాంగణాలు పూర్తిగా నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తాగునీరు, పాలు పంపిణీ చేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

చీకట్లో గుడిపాల

గుడిపాల: గుడిపాల మండల కేంద్రంలోని చైన్నె–బెంగుళూరు జాతీయ రహదారిపై వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రయాణికులు చీకట్లోనే మగ్గుతున్నారు. గుడిపాల మండల కేంద్రంలో ఒక కిలోమీటరు మేర జాతీయ రహదారిపై రోడ్డు పక్కన సోలార్‌ లైట్లు ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా ఈ లైట్లు వెలగకపోవడంతో గుడిపాల మండల కేంద్రం అంధకారంలో ఉంది. అధికారులు స్పందించి వెంటనే లైటు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement