చిత్తూరు రూరల్ (కాణిపాకం): గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో చిత్తూరు జిల్లా పోలీస్ సిబ్బంది అద్భుత ప్రదర్శనతో మెరిశారు. వివిధ క్రీడా పోటీల్లో తమ మార్కు చూపిస్తూ ఏకంగా 9 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 17 పతకాలను సొంతం చేసుకుని జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. పోటీల్లో ప్రతిభ చాటిన వారిలో బి.సుధాకర్ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకోగా, కె.ధనలక్ష్మి షాట్‌పుట్, జావాలిన్ త్రోలో 2 బంగారు పతకాలు, బాక్సింగ్‌లో రజత పతకం సాధించారు. ఎం.లావణ్య వెయిట్ లిఫ్టింగ్ (45 కేజీలు), పవర్ వెయిట్ లిఫ్టింగ్ (83 కేజీలు) విభాగాల్లో 2 బంగారు పతకాలు, 4400 రిలేలో రజతం, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. అలాగే బాక్సింగ్‌లో షేక్ ఫైరోజ్, బాడీ బిల్డింగ్‌లో బి.ప్రవీణ్ స్వర్ణ పతకాలు సాధించారు. కార్వేటినగరం ఎస్‌ఐ డి.తేజస్విని రెజ్లింగ్, బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగాల్లో 2 రజత పతకాలు పొందగా, యు.అరుణ వెయిట్ లిఫ్టింగ్ (67 కేజీలు), పవర్ వెయిట్ లిఫ్టింగ్ (84 కేజీలు) విభాగాల్లో 2 రజతాలు సాధించారు. బాడీ బిల్డింగ్‌లో ఆర్‌ఐ ఎం.చంద్రశేఖర్ కాంస్య పతకం దక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జిల్లా పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన పోలీస్ క్రీడాకారులను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, తోటి అధికారులు ఘనంగా అభినందించారు.


