బంగారుపాళెం: మండలంలోని మొగిలి పంచాయతీ గౌరీశంకరపుం వద్ద మంగళవారం రాత్రి ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చేసే కార్మికుడిపై ఒంటరి ఏనుగు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గౌరీశంకరపురం సమీపంలో ఎక్స్‌ప్రెస్ హైవే ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే సంబంధించిన అధికారులు, కార్మికులు ఉంటున్నారు. రాత్రి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్‌సింగ్ ఫోన్ మాట్లాడుకుంటుండగా గౌనిచెరువు సమీపంలో నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు తొండంతో కొట్టి దాడిచేసింది. మాన్‌సింగ్‌కు తీవ్రగాయాలు తగిలాయి. కేకలు వేయడంతో తోటి కార్మికులు అక్కడికి చేరుకున్నారు. మనుషులు రావడంతో ఏనుగు అడవిలోకి పోయింది. ఏనుగు దాడిలో గాయపడిన వ్యక్తిని సహచరులు పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గత పది రోజులుగా ఏనుగులు గుంపు మొగిలి దేవరకొండ, గౌనిచెరువు, కౌండిన్య అటవీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి.
పీఎం శ్రీ గ్రాంట్లపై
అవగాహన ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు విడుదలైన గ్రాంట్ల వినియోగంపై ప్రధానోపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన గ్రాంట్లను నిబంధనల ప్రకారం పారదర్శకంగా వినియోగించాలన్నారు. ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్ పోర్టల్‌లో పీఎం శ్రీ పాఠశాలలకు విడుదలైన 9 రకాల గ్రాంట్లను ఏవిధంగా ఖర్చు చేయాలనే అంశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రాంట్ల నిధులను వినియోగించే సమయంలో సంబంధిత వెండర్ల పూర్తి వివరాలను తప్పనిసరిగా సేకరించి నమోదు చేయాలన్నారు. గత విద్యాసంవత్సరంలో ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్ నిధులతో చేపట్టిన పనులు, చేసిన ఖర్చుల వివరాలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్ష శాఖ ఏఎంవో సుభాషిణి, రీసోర్స్ పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
వ్యభిచారం
నిర్వాహకులపై కేసు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం వన్‌టౌన్ సీఐ చిన్నపెద్దయ్య తన సిబ్బందితో కలిసి సుందరయ్య వీధిలోని పలు లాడ్జిల్లో దాడులు నిర్వహించారు. ఓ లాడ్జిలో రాజమండ్రికి చెందిన మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. బాధిత మహిళలను పునరావాస కేంద్రాలకు తరలించి, లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదుచేశారు.


