చిత్తూరు కలెక్టరేట్ : నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. బుధవారం నగర సరిహద్దులో ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, దేశ పురోగతికి యువత తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలన్నారు. విద్య, సాంకేతికత, క్రీడలు, కళలు తదితర రంగాల్లో యువత దేశానికి వెన్నెముకలా నిలుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలు, చెడు అలవాట్ల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. సన్మార్గంలో పయనిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ జోలికి వెళ్లకూడదని, సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సీసీఎస్ సీఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్స్‌కు యువత దూరంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ సెక్యూరిటీ సీఐ ప్రవీణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాను అనవసర విషయాలకు దుర్వినియోగం చేయకుండా, విజ్ఞానదాయకమైన మంచి కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ సభ్యులు గిరిబాబు, సీతమ్స్ కళాశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ నాగేశ్వర ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వెంకటాచలపతి పాల్గొన్నారు.


